ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. 10 ఏళ్ల పాటు రూ.10 వేల వరకు పెన్షన్ పొందండి..!
PMVVY: సాధారణంగా 30 నుంచి 40 ఏళ్ల వ్యక్తులు స్టాక్ మార్కెట్, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి రిస్క్ తీసుకుంటారు. కానీ రిటైర్మెంట్ అయిన సీనియర్ సిటిజన్లు అలాంటి వాటిలో
PMVVY: సాధారణంగా 30 నుంచి 40 ఏళ్ల వ్యక్తులు స్టాక్ మార్కెట్, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి రిస్క్ తీసుకుంటారు. కానీ రిటైర్మెంట్ అయిన సీనియర్ సిటిజన్లు అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టగలరా.. ఆ సాహసం చేయలేరు. ఎందుకంటే చివరి వయసులో దాచుకున్న డబ్బు కోల్పోతే మళ్లీ సంపాదించడానికి అవకాశం ఉండదు. కానీ మంచి పెన్షన్ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా చేస్తే వారి డబ్బులు సురక్షితంగా ఉంటాయి. అంతేకాకుండా పెన్షన్ కూడా అందుతుంది. అలాంటిదే ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎమ్‌వీవీవై) పథకం. ఇది సీనియర్ సిటిజన్లకు భద్రత కల్పిస్తుంది. 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 10 ఏళ్ల పాటు పింఛనుకు హామీ ఉంటుంది. దీన్ని లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) నిర్వహిస్తోంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతం. ఈ పథకంలో చేరేందుకు తొలుత 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండగా ప్రస్తుతం మార్చి 2023 వరకు పొడిగించారు.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కి ప్రభుత్వ గ్యారంటీ ఆధారంగా సబ్ స్క్రిప్షన్ అయిన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద పెట్టుబడి గరిష్ట పరిమితి రూ.15 లక్షలు, నెలవారీ పెన్షన్ రూ.10,000. ఈ పథకం 10 సంవత్సరాలపాటు సంవత్సరానికి 8 శాతంతో కూడిన రాబడిని అందిస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ఫ్రీక్వెన్సీ ప్రకారం 10 సంవత్సరాల పాలసీ వ్యవధిలో ప్రతి వ్యవధి ముగింపులో పెన్షన్ చెల్లిస్తారు. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 12,000 పెన్షన్ కోసం కనీస పెట్టుబడి రూ. 1,56,658 ఉంటుంది. అలాగే నెలకు రూ. 1000 కనీస పెన్షన్ మొత్తం పొందడానికి కనీస పెట్టుబడి రూ.1,62,162 గా నిర్ణయించారు.
పీఎమ్‌వీవీవై నిర్దేశించిన వడ్డీరేటు ప్రకారం 10 ఏళ్లపాటు కచ్చితమైన పెన్షన్‌ను ఇస్తుంది. ఈ పథకం డెత్ బెనిఫిట్ కూడా ఆఫర్ చేస్తోంది. పాలసీదారుడు మరణిస్తే బీమా కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు. మెచ్యూరిటీ నాటికి పాలసీదారడు జీవించి ఉంటే.. పాలసీ కొనుగోలు చేసిన 10 ఏళ్లకు.. ఎంత ప్రీమియంకైతే కొన్నామో ఆ మొత్తం ఇచ్చేస్తారు. దీంతో పాటు పింఛను చివరి వాయిదాను పొందుతారు. పాలసీదారుకు/ పింఛనుదారుకు అనుకోకుండా ఏమైనా జరిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు. పాలసీ కొనుగోలు చేసిన తర్వాత 3 ఏళ్లకు రుణ సదుపాయాన్ని పొందొచ్చు. కొనుగోలు ధరలో గరిష్ఠంగా 75 శాతం మేరకు రుణం ఇస్తారు.