Raghuram Rajan: భారతీయుల్లో నమ్మకం సన్నగిల్లింది.. దేశ ఆర్థిక వ్యవస్థపై రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు
భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక భవిష్యత్తుపై ఈ మధ్య కాలంలో దేశ ప్రజల్లో నమ్మకం(ఆత్మ విశ్వాసం) సన్నగిల్లిందని ఆయన వ్యాఖ్యానించారు.
India Economy News: భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక భవిష్యత్తుపై ఈ మధ్య కాలంలో దేశ ప్రజల్లో నమ్మకం(ఆత్మ విశ్వాసం) సన్నగిల్లిందని ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్-19 పాండమిక్ చాలా మంది మధ్య తరగతి ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తోందని ఆయన పేర్కొన్నారు. అటు పైపైకి దూసుకుపోతున్న భారత స్టాక్ మార్కెట్లో నెలకొన్న పాజిటివ్ సెంటిమెంట్‌పై కూడా ఆయన పెదవి విరిచారు. చాలా మంది భారతీయులు తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్నారన్న అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వాస్తవిక దుస్థితిని ప్రతిబింభిచడం లేదన్నారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నిర్వహించిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని మాట్లాడిన రఘురాం రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మంచి ఉద్యోగ అవకాశాల సృష్టి ద్వారా మాత్రమే దేశ ఆర్థిక కార్యక్రమాలపై నమ్మకం ఏర్పడుతుందని రఘురాం రాజన్ పేర్కొన్నారు. అయితే చాలా రాష్ట్రాలు స్థానికులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ.. భారతీయ ఆలోచనను బలహీనపరుస్తున్నాయని వ్యాఖ్యానించారు. అందరికీ ప్రయోజనకరంగా లేని అభివృద్ధి..చాలా కాలం నిలబడదన్నారు.
అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో భారత్ భాగస్వామ్యం కావాల్సిన అవసరముందని ఆయన నొక్కిచెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరముందని రాజన్ అభిప్రాయపడ్డారు. చర్చ, విమర్శలను తొక్కిపెట్టాలనుకోవడం సరికాదన్నారు.
ప్రస్తుతం రఘురాం రాజన్..యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫసర్‌గా పనిచేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతంగా ఉండొచ్చన్న మునుపటి అంచనాను 9.5 శాతానికి ఆర్బీఐ సవరించింది. 2021లో భారత ఆర్థిక వృద్ధిరేటు 9.5 శాతంగా.. వచ్చే సంవత్సరం(2022) ఇది 8.5 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) సంస్థ అంచనావేసింది.