CoWIN App: కోవిన్ పోర్టల్‌లో ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా.. అందులో ఏముంటుంది!
CoWIN App: కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వ్యాక్సిన్ తీసుకోవాలంటే కోవిన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవడం అనేది..
CoWIN App: కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వ్యాక్సిన్ తీసుకోవాలంటే కోవిన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవడం అనేది అందరికి తెలిసిందే. దీనిని కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా రూపొందించింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకునే వరకు ఈ కోవిన్ పోర్టల్ (CoWIN) ఉపయోగపడనుంది. ఇప్పటికే చాలా మంది భారతీయులు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. దీని ద్వారా వ్యాక్సిన్ కోసం బుకింగ్ చేసుకోవడం, వ్యాక్సిన్ సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. ఇంకా వ్యాక్సిన్ మొదటి డోస్ కూడా వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. వ్యాక్సిన్‌తో మనం చాలావరకు కరోనా నుంచి బయటపడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఇక వ్యాక్సిన్ తీసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకునేందుకు కోవిన్ యాప్ తప్పనిసరి కావడంతో చాలా మంది ఈ యాప్‌ను తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. మనం వ్యాక్సిన్ వేయించుకున్నాక సర్టిఫికెట్ కావాలన్నా కోవిన్ యాప్ తప్పనిసరి. ఇప్పుడు కోవిన్ పోర్టల్‌లో మార్పులు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ఉపయోగపడేలా ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కోవిన్ యాప్‌లో కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికేట్ కూడా అందుబాటులో ఉంది. ఈ సర్టిఫికెట్ ఉంటే మనం ప్రపంచంలోని చాలా దేశాలకు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫికేట్ లేనిది ఎక్కడికి కూడా అనుమతి ఉండదు. కొన్ని దేశాలు ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్ ఉంటేనే తమ దేశానికి వచ్చేందుకు అనుమతిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా ఈ సర్టిఫికెట్ లేకపోతే తమ దేశంలోకి రానివ్వడం లేదు. అందువల్ల ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వారికి ఇది తప్పనిసరి ఈ సర్టిఫికేట్.
ఈ సర్టిఫికేట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ విధించిన ఇంటర్నేషనల్ ట్రావెల్ గైడ్‌లైన్స్‌తో పాటు మన పేరు, పుట్టిన తేదీ ఉంటాయి. ప్రపంచస్థాయి డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన కోవిన్‌యాప్‌లో ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్ మీ పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలతో లభిస్తుందని అని నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) సీఈవో శర్మ వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోవిన్ పోర్టల్‌లో సర్టిఫికేట్ పొందడం ఎలా..?
ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్ కావాలనుకునేవారు ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో కోవిన్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. International Travel Certificate అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకు WHO డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా దేశం వేరే ఫార్మాట్‌లో టీకా సర్టిఫికెట్ కోరితే.. ఆ ఫీచర్‌ను కూడా తీసుకువస్తామని ఎన్‌హెచ్‌ఏ చెబుతోంది.
యాప్ ద్వారా సర్టిఫికెట్ ఎలా పొందాలి?:
కోవిన్ యాప్ ద్వారా సర్టిఫికెట్ పొందాలనుకుంటే ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో కోవిన్ యాప్‌లో లాగిన్ కావాలి. యాప్‌లో సర్టిఫికెట్ ట్యాబ్‌కు కుడివైపున ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వివరాలు ఇచ్చి.. సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు.
సర్టిఫికెట్‌లో ఏం ఉంటుంది?
ఇక డౌన్‌లోడ్ చేసుకున్న ట్రావెల్ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ, మీరు ఎన్ని డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు, ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు, వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారు, ఏ నెలలో ఏ రోజున తీసుకున్నారు, తీసుకున్న డోస్ బ్యాచ్ నెంబర్, మీకు టీకా వేసినవారి పేరు వంటి వివరాలుంటాయి. ఈ సర్టిఫికెట్ డబ్ల్యూహెచ్‌వో, డీడీసీసీ( WHO-DDCC) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది.