Gold: వచ్చే నెలలో బంగారం ధరలు తగ్గుతాయా.. అసలు నిజాలు ఇవే..
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు గత నెలలో బాగా పడిపోయాయి. అమెరికా వడ్డీ రేట్లు, చైనా వ్యాపారం వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపాయి. ఈ వారం ధరలు అస్థిరంగా ఉన్నా, దీర్ఘకాలంలో ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గత నెలలో ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో దేశంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. అయితే కొత్త వారం ప్రారంభం కావడంతో ఈ విలువైన లోహాల ధరల కదలికపై పెట్టుబడిదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తారనే అంచనాలు తగ్గాయి. దీనివల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని కొనడం తగ్గించారు. అమెరికా, చైనా మధ్య ఉన్న వ్యాపార గొడవలు కాస్త తగ్గాయి. ఇలాంటి సమస్యలు తగ్గినప్పుడు, బంగారం వంటి సురక్షితమైన వాటిపై పెట్టుబడి పెట్టడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపరు. అందుకే డిమాండ్ తగ్గి ధరలు పడిపోయాయి.
నవంబర్ 10 నాటికి దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 12,322 వద్ద ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 11,295 కాగా, 18 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ. 9,242గా ఉంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు ఏకంగా 50శాతం పెరిగాయి.
వెండి ధరల విషయానికి వస్తే.. ప్రస్తుతం గ్రాముకు రూ. 155 ఉండగా.. కిలో వెండి రూ. 1,55,000 వద్ద ఉంది. అక్టోబర్ నెల ప్రారంభం నుండి వెండి రేటు గణనీయంగా తగ్గడం గమనార్హం. నవంబర్ 7నాడు ఫ్యూచర్స్ మార్కెట్‌లో.. డిసెంబర్ నెలకు బంగారం 10 గ్రాములకు రూ. 121,067 వద్ద ముగియగా.. వెండి ఫ్యూచర్స్ కిలోకు రూ. 147,728 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం.. ఆ రోజు ప్రపంచ బంగారం ధర ఔన్సుకు 4,010 డాలర్లుగా అంచనాలు ఉన్నాయి.
దీర్ఘకాలికంగా విలువైన లోహాల విలువలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. VT మార్కెట్స్‌లో గ్లోబల్ స్ట్రాటజీ లీడ్ రాస్ మాక్స్‌వెల్ ప్రకారం.. ‘‘బంగారం, వెండికి మంచి మద్దతు ఉంది. పెట్టుబడిదారులు తొందరపడటం లేదు, కానీ బంగారాన్ని వదులుకోవడం కూడా లేదు. ఈ వారం ఆర్థిక సమాచారం ఎలా ఉంటాయనే దానిపైనే ధరల కదలిక ఆధారపడి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




