Gold Prices: ఇదే జరిగితే 2026లో బంగారం ధరలు ఢమాల్.. 20 శాతం తగ్గే ఛాన్స్.. !
డిసెంబర్ ముగియడానికి ఇంకెన్ని రోజులే ఉంది. త్వరలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్‌కి వెల్‌కమ్ చెప్పేందుకు అందరూ సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలపై తెగ చర్చ జరుగుతోంది. 2026లో అయినా తగ్గుతాయా..? లేక పెరుగుతాయా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది.

Gold Rates India: చరిత్రలో ఎన్నడూ లేనంతంగా 2025లో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రాజకీయ అనిశ్చితి, ఆర్ధిక అస్ధిరత , రూపాయి పతనం, రిజర్వ్ బ్యాంకు నిల్వలు వల్ల ఇండియాలో గోల్డ్ రేట్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏకంగా తులం బంగారం రూ.లక్షన్నరకు చేరుకుంది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నారు. ఇటీవల కేజీ వెండి ఏకంగా రూ.2 లక్షలకు చేరుకుంది. దీంతో బంగారం అత్యుత్తమ ఆస్తిగా ఉండటంతో పాటు ఈ ఏడాది పెట్టుబడిదారులకు భారీగా లాభాలను తెచ్చి పెట్టింది. ఏడాది ముగియనున్న క్రమంలో కొత్త ఏడాది 2026లో బంగారం ధరలు ఎలా ఉంటాయోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పెట్టుబడిదారులు కూడా 2026లో బంగారంపై లాభాలు నిలబడతాయా? లేదా తగ్గుతాయా? అని తెగ చర్చించుకుంటున్నారు.
2025లో భారీగా రాబడి
ఆర్బీఐ డేటా ప్రకారం బంగారంపై 2025లో 67.7 శాతం రాబడి పెట్టుబడిదారులు అందుకున్నారు. దీంతో 2026లో కూడా బలమైన వృద్ది ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు తగ్గడం, ప్రపంచ ఆర్ధిక సెంటిమెంట్ మెరుగుపడితే బంగారం రేటు తగ్గే అవకాశముందని అంటున్నారు. ఇక వడ్డీ రేట్లు తగ్గించడం, అనిశ్చితిని తగ్గించడం వల్ల కూడా బంగారం తగ్గే అవకాశముంది. ద్రవ్యోల్బణం కొనసాగితే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు మందగించే అవకాశముంది. ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ధరలు తగ్గడానికి ఉన్న అవకాశాలు
2026లో బంగారం ధర తగ్గడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు అధికంగా ఉండటం వల్ల ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఎక్కువ రేట్లు ఉన్న కారణంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ మొగ్గు చూపడం లేదు. దీంతో సేల్స్ కూడా భారీగా పడిపోయాయి. దీని వల్ల డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల 2026లో ధరలు కూడా తగ్గే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. ఇక బంగారం ధరలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు విధానంపై ఆధారపడి ఉంటాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చనే వార్తలు క్రమంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఒకవేళ దాని గురించి ఖచ్చితమైన సమాచారం వస్తే బంగారం ధర 10 నుంచి 20 శాతం తగ్గే అవకాశముంటుందని అంటున్నారు.




