Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అద్భుత అభినయం చూసి సెట్‌లోనే కంటతడి పెట్టిన నటీమణి..
దర్శకుడు కృష్ణవంశీ జూనియర్ ఎన్టీఆర్ మెమరీ పవర్, రాఖీ సినిమాలోని కోర్టు సీన్ గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. మొగుడు చిత్రాన్ని తన జీవితంలో చేదు అనుభవంగా అభివర్ణించారు. తన ఉత్తమ, చెత్త చిత్రాలను వివరించారు. ఆ డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం ...

ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు కృష్ణవంశీ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ మెమరీ పవర్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాఖీ చిత్రంలోని కోర్టు సన్నివేశంలోని పది నిమిషాల సుదీర్ఘ డైలాగ్‌ను ఎన్టీఆర్ ఒక్క టేక్‌లో చెప్పిన తీరును కొనియాడారు. ఈ సన్నివేశం కోసం పరుచూరి గోపాలకృష్ణ, ఉత్తేజ్ వంటి రచయితల సహకారంతో వెర్షర్స్ రెడీ చేసి, చివరికి తాను రీ రైట్ చేసి తారక్‌తో చెప్పించినట్లు వివరించారు. 10 నిమిషాల్లో ప్రిపేర్ అయి ఎన్టీఆర్ డైలాగ్ మొత్తం చెప్పినట్లు వెల్లడించారు. సీన్ షూట్ చేస్తుండగా.. ఎన్టీఆర్ ఆ డైలాగ్ చెప్తూ అభినయించడం చూసి.. అక్కడే ఉన్న నటి సుహాసిని కంటతడి పెట్టుకున్నారని పేర్కొన్నారు. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ వంటి ఇతర నటులకు కూడా అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని కృష్ణవంశీ ప్రస్తావించారు.
తన కెరీర్‌లోని కొన్ని చేదు అనుభవాలను పంచుకుంటూ, మొగుడు చిత్రాన్ని తన జీవితంలో ఒక చేదు అధ్యాయంగా అభివర్ణించారు. నిర్మాణ సంస్థ పరిస్థితులు, కొంతమంది వ్యక్తుల ఎజెండాలు సినిమాను తీవ్రంగా ప్రభావితం చేశాయని, దాంతో తాము అనుకున్న కథాంశం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిది నుండి పది నెలల పాటు ఆ ప్రాజెక్ట్‌లో పనిచేశానని, అది తనకు చాలా చేదు అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు. మొగుడు, పైసా చిత్రాలను తన చెత్త చిత్రాలుగా పేర్కొంటూ, వాటి వైఫల్యానికి తన అసహాయత, అసమర్థతే కారణమని అంగీకరించారు. అదే సమయంలో, తనకెంతో గర్వకారణమైన చిత్రాలను కూడా వెల్లడించారు. చంద్రమామ, మురారి, అంతఃపురం, ఖడ్గం, డేంజర్ చిత్రాలను తన ఉత్తమ రచనలుగా పేర్కొన్నారు. ముఖ్యంగా డేంజర్ చిత్రం సాధారణ రొమాన్స్, పాటలు, కామెడీలు లేకపోయినా, తక్కువ బడ్జెట్‌లో (80 లక్షలు) నిర్మిస్తే లాభాలను అందించిదని, దాని ఫలితం పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.
అంతఃపురం చిత్రంలో సౌందర్యను మొదట ఎంపిక చేయడానికి తాను ఇష్టపడలేదని, ఒక ఎన్‌ఆర్‌ఐ అమ్మాయి పాత్రకు ఆమె సరిపోదని భావించినట్లు చెప్పారు. కానీ, రెండు రోజుల షూటింగ్ తర్వాత సౌందర్య ఆ పాత్రకు అద్భుతంగా సరిపోతుందని గ్రహించానని వెల్లడించారు.




