Tollywood: 5 లక్షలతో తీసిన ఫోక్ సాంగ్.. కోటి రూపాయలు కొల్లగొట్టి.. ఇంకా దూసుకుపోతుంది..
ప్రముఖ గాయకుడు రాము రథోడ్, రాను బొంబాయికి రాను పాట విజయం, దాని వెనుక ఉన్న కృషిని వివరించారు. యూట్యూబ్‌లో రాత్రికి రాత్రే వచ్చే విజయాలపై అపోహలను తొలగించి, కళాకారులకు కష్టపడటం, మూలాల నుంచి ఎదగడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. ..

రాను బొంబాయికి రాను పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్‌లో 675 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే.. పాట జనాల్లోకి ఎలా చొచ్చుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. జాతర్లలోనే కాదు.. పబ్బుల్లోనూ ఇప్పుడు ఈ పాటే హైలెట్. ఈ సాంగ్ ప్లే అవ్వని ఆటో ఉండదంటే అతిశయోక్తి కాదు. కాగా ఈ సాంగ్ రాసి, పాడిన రాము రాథోడ్, తన విజయ రహస్యాన్ని, యూట్యూబ్ పరిశ్రమలో నెలకొన్న అపోహలను క్లారిఫై చేశారు. ఇటీవలి కాలంలో యూట్యూబ్‌లో పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చని చాలామంది భావిస్తున్నారని, అయితే అది వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినవారు అప్పులు చేసి ఈ రంగంలోకి వచ్చి మోసపోవద్దని హెచ్చరించారు. రాము రథోడ్ తన ప్రయాణాన్ని వివరించగా, దాదాపు 16 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నానని, ఎన్నో ఫ్లాప్ పాటల తర్వాతే రాను బొంబాయికి రాను పాట విజయవంతమైందని తెలిపారు. ఐదు, ఆరు పాటల తర్వాతనే ఇది తనకు లాభాలను తెచ్చిపెట్టిందని ఆయన పేర్కొన్నారు. కేవలం అదృష్టం, డబ్బుతోనే కాకుండా, పాటలో ఉన్న వైబ్, ఆ సాంగ్ వెనుక ఉన్న కృషి దీని విజయానికి ప్రధాన కారణాలని ఆయన వివరించారు.
రాను బొంబాయికి రాను పాట ద్వారా రెండు కోట్లు సంపాదించారనే వార్తల్లో వాస్తవం లేదని రాము రాథోడ్ స్పష్టం చేశారు. ఆ మొత్తంలో కోటి రూపాయలు ఆడియో ప్లాట్‌ఫారమ్‌లు, వీడియోలు, రీల్స్ ద్వారా వచ్చిన ఆదాయం అని తెలిపారు. యూట్యూబ్‌లోకి వచ్చే యువ కళాకారులు, వారి తల్లిదండ్రులు తొందరపడి డబ్బులు పెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కళాకారులు మూలాల నుంచి, అంటే చిన్న స్థాయి నుండి క్రమంగా ఎదగాలని, బలమైన పునాదులు లేకుండా ఒక్కసారిగా పైకి ఎగిరితే అది నిలబడదని ఆయన స్పష్టం చేశారు. ఈ రంగంలో విజయం సాధించడానికి పట్టుదల, నిరంతర కృషి అవసరమని, గట్టి నమ్మకం ఉంటేనే ముందుకు సాగాలని ఆయన సూచించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




