Hyundai Creta EV: త్వరలోనే మార్కెట్‌లోకి క్రెటా ఈవీ.. అదరగొడుతున్న టాప్ ఫీచర్స్
భారతదేశంలో ఈవీ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా స్కూటర్లే అమ్మకాలు సాగిస్తున్నాయి. కానీ గత కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా కొనుగోలుకు ఆసక్తి చూపడంతో చాలా కంపెనీలు తమ సక్సెస్ మోడల్స్‌ను ఈవీ వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హ్యూందాయ్ తన టాప్ సెల్లింగ్ మోడల్ క్రెటా ఈవీను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రెటా ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీల్లో ఒకటైన హ్యుందాయ్ క్రెటా మార్కెట్లోకి ప్రవేశించిన 10 సంవత్సరాల తర్వాత ఈవీ వెర్షన్‌లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. జనవరి 17న జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో హ్యూందాయ్ ఎలక్ట్రిక్ క్రెటా లాంచ్ చేయనున్నారు. హ్యుందాయ్ 2015లో ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 11 లక్షల క్రెటా యూనిట్లు అమ్ముడయ్యాయి. భారతదేశంలో 10 లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని దాటిన మూడు ఎస్‌యూవీల్లో ఒకటిగా ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ గ్రానైట్ గ్రే, డార్క్ నేవీలో డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్‌తో వస్తుంది. ఇక కన్సోల్ విషయానికి వస్తే ఓషన్ బ్లూ సరౌండ్ యాంబియంట్ లైటింగ్‌తో వస్తుంది. డ్యూయల్ కర్విలినియర్ ఇన్ఫోటైన్‌మెంట్ 10.25 అంగుళాల స్క్రీన్‌తో పాటు టచ్-ఎనేబుల్డ్ డ్యూయల్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంటుంది.
క్రెటా ఎలక్ట్రిక్ 2,610 ఎంఎం వద్ద క్రెటా ఐసీఈకు సమానమైన వీల్‌బేస్‌తో వస్తుంది. క్రెటాలో వాడిన ఫాబ్రిక్ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ సీసాలతో చేశారు. అలాగే కృత్రిమ లెదర్ సీట్ అప్హోల్స్టరీ కోసం మొక్కజొన్న సారంతో సహా స్థిరమైన పదార్థాలతో తయారు చేసిన పర్యావరణ అనుకూలమైన సీట్లను వాడారు. డ్రైవర్-సైడ్ మెమరీ సీట్ ఫీచర్, 8 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లతో పాటు వెనుక ఉన్నవారు మరింత లెగ్‌రూమ్ కోసం ముందు ప్రయాణీకుల సీటును ఎలక్ట్రిక్‌గా సర్దుబాటు చేసే సదుపాయం ఉది. 433 లీటర్ల బూట్‌తో పాటు, క్రెటా ఎలక్ట్రిక్ 22 లీటర్ల ఫ్రంక్ స్పేస్ ఆకట్టుకుంటుంది. క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలతో వస్తుంది. అలాగే క్రెటా ఈవీలో అనేక మోటార్ ఎంపికలు ఉన్నాయి. 99 కేడబ్ల్యూ, 126 డబ్ల్యూ మోటర్లతో పని చేస్తుంది.
క్రెటా ఈవీ 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 390 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఓ సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. 11 కేడబ్ల్యూ కనెక్టెడ్ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా క్రెటా ఈవీ కారును 10 శాతం నుంచి 100 శాతం ఛార్జ్ చేయవచ్చు. ఈ కారున పూర్తిగా చార్జ్ చేయడానికి నాలుగు గంట సమయం పడుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 58 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం చార్జ్ చేయవచ్చు. భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ఈవీ ధర రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి