టాఫీలు, క్యాండీల అమ్మకాలను దెబ్బకొట్టిన యూపీఐ లావాదేవీలు

భారతదేశ మొబైల్ బ్యాంక్-టు-బ్యాంక్ తక్షణ చెల్లింపుల వ్యవస్థ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) దాదాపు ప్రతి దుకాణంలో సర్వవ్యాప్తి చెందింది. యూపీఐ చెల్లింపు అనేది డీమోనిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రారంభించినఆర్థిక విప్లవం కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ట్రెండ్ పెరిగింది. డిజిటల్ చెల్లింపును స్వీకరించడం ఒక ప్రగతిశీల చర్య.

టాఫీలు, క్యాండీల అమ్మకాలను దెబ్బకొట్టిన యూపీఐ లావాదేవీలు
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Jan 12, 2025 | 7:12 PM

కొత్త ఆవిష్కరణలు పాత తరం వస్తువుల తయారీని దెబ్బతీస్తుంటాయి. ఇది వ్యాపారంలో అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకు ఎల్‌సీడీ (LCD), ఎల్ఈడీ (LED) ఫ్లాట్ ప్యానెళ్ల ఆవిష్కరణ తర్వాత పాత డబ్బా టీవీలు అటకెక్కాయి. టేప్ రికార్డర్లను సీడీ, డీవీడీ ప్లేయర్లు దెబ్బకొట్టగా, స్మార్ట్ ఫోన్లు సీడీ ప్లేయర్లతో పాటు అనేక పరికరాలను దెబ్బకొట్టాయి. కాలక్రమంలో ఇది సహజం. అయితే నగదు చెల్లింపుల విషయంలో వచ్చిన ఓ ఆవిష్కరణ ఓ పరిశ్రమను దారుణంగా దెబ్బకొట్టింది. అదే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI). నగదు చెల్లింపుల విషయంలో భారత్‌లో జరిగిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతోంది. ఆ విషయం పక్కనపెడితే.. UPI సేవలు అందుబాటులోకి వచ్చాక టాఫీలు, క్యాండీలు, చిన్న చిన్న చాక్లెట్ల వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నది. అదెలా అంటే…!

చిల్లర లేదు – టాఫీ తీసుకో..

కిరాణా షాపులు, పాన్ డబ్బాలు, కూల్ డ్రింక్ స్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు సహా సూపర్ మార్కెట్లలో ఏవైనా వస్తువులు తీసుకున్నప్పుడు నగదు రూపంలో వాటి ధరకు సరిపడా చెల్లించే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఏదైనా వస్తువు ధర రూ. 296 అయితే మనం రూ. 300కు సరిపడా నోట్లను దుకాణదారుడికి ఇస్తుంటాం. ఆ వ్యాపారి మిగిలిన రూ. 4కు చిల్లర ఉంటే ఇస్తాడు. లేదంటే “చిల్లర లేదు – టాఫీ లేదా క్యాండీ తీసుకోండి” అంటూ ఒక్కొక్కటి ఒక రూపాయి విలువ కల్గిన 4 టాఫీలను చేతిలో పెట్టేవారు. చిల్లర ఉన్నా సరే.. వ్యాపారులు వీటిని కస్టమర్లకు అంటగట్టేవారు. తద్వారా వీటి అమ్మకాల ద్వారా కూడా వారికి లాభం వచ్చేది.

ఇటు కస్టమర్లు సైతం “సర్లే.. చిల్లర లేదు కదా” అనుకుంటూ వాటిని తీసుకుని జేబులో వెసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇలా చిల్లర నాణేలకు బదులుగా టాఫీలను ఇవ్వడం చూడ్డానికి చిన్నదిగా కనిపించినా వేల కోట్ల మొత్తంలో వ్యాపారం సాగేది. ఒక దుకాణంలో రోజు మొత్తంలో వందల నుంచి వేల రూపాయల విలువైన టాఫీలు, క్యాండీలు ఇలా అమ్మడుపోతుండేవి. కానీ ఇదంతా గతం. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో నగదు లావాదేవీల స్థానాన్ని డిజిటల్ లావాదేవీలు ఆక్రమించాయి. అవే ఇప్పుడు టాఫీ పరిశ్రమను దారుణంగా దెబ్బకొట్టాయి.

ఎందుకంటే.. యూపీఐ విధానం ద్వారా బిల్లు ఎంతైతే అంతే మొత్తంలో చెల్లించే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే పైసాతో సహా కచ్చితమైన మొత్తంలో యూపీఏ ద్వారా పేమెంట్ చేయవచ్చు. దీంతో చిల్లర లేదు అని సాకు చూపుతూ టాఫీలను, క్యాండీలను అవసరం లేకున్నా అంటగట్టే పరిస్థితి లేకపోయింది.

బిలియన్ల కొద్దీ డిజిటల్ లావాదేవీలు

ఒకప్పుడు భారత్ వంటి దేశంలో డిజిటల్ లావాదేవీలు సాధ్యమా అని కాంగ్రెస్ పార్టీకి చెందిన పి. చిదంబరం వంటి నేతలు హేళన చేశారు. “కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు ‘పాయింట్ ఆఫ్ సేల్’ (POS) మెషీన్లను పెట్టుకుని కూర్చుంటారా?.. ఒకవేళ కూర్చొన్నా వారికి ఇంటర్నెట్ సదుపాయం ఉంటుందా? పెద్దగా చదువుకోనివారు ఇలాంటి లావాదేవీలు చేయగలరా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

కానీ 5జీ ఇంటర్నెట్ సదుపాయం, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడమే కాదు.. వాటితో పాటు డిజిటల్ లావాదేవీలు నానాటికీ పెరిగాయి. అందులోనూ యూపీఐ (UPI) విధానం ప్రపంచంలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. కూరగాయలు అమ్మేవారే కాదు, చెప్పులు కుట్టేవారు.. చివరకు భిక్షాటన చేసేవారు సైతం QR కోడ్ చూపిస్తూ డిజిటల్ పేమెంట్లను స్వీకరిస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం గత నెల (డిసెంబర్, 2024)లో జరిగిన UPI లావాదేవీలు సంఖ్య 16.73 బిలియన్లు. అంతకు ముందు నెల 15.28 బిలియన్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి.

ఓ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 13 మిలియన్ల కిరాణా దుకాణాలు ఉన్నాయి. ఇన్ని దుకాణాల్లో ఇదివరకటిలా నగదు లావాదేవీలు జరిగినప్పుడు అమ్మడుపోయే టాఫీలు, క్యాండీలు ఇప్పుడు దాదాపు లేకుండా పోయాయి. ఎవరైనా పిల్లలు వాటిని కోరుకుని కొనుక్కుంటే తప్ప టాఫీలు, క్యాండీలు అమ్ముడుపోవడం లేదు. యూపీఐ రాకముందు టాఫీలు, క్యాండీలు తయారు చేసే బడా కంపెనీలు Mondelez, మార్స్, నెస్లే, Perfetti, పార్లే, ITC ఏడాదికేడాది తమ వ్యాపారంలో వృద్ధిని చూశాయి. కానీ ఇప్పుడు ఏడాదికేడాది ఆ వృద్ధి తిరోగమనంలోనే కనిపిస్తోంది. దీనంతటికీ కారణం యూపీఐ. నగదు రహిత లావాదేవీల్లో యూపీఐ వాటా కూడా ప్రతియేటా పెరుగుతోంది. 2022-23 ఏడాదిలో నగదు రహిత (డిజిటల్) రిటెయిల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 73.17 శాతం. యూపీఐ కాకుండా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపుల్లోనూ కచ్చితమైన మొత్తాన్ని చెల్లించే అవకాశం ఎలాగూ ఉంటుంది. మొత్తంగా డిజిటల్ పేమెంట్ విధానం టాఫీ, క్యాండీ పరిశ్రమను దారుణంగా దెబ్బతీస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..