Contactless Payment: పండగ సీజన్‌లో కొనుగోళ్లు జోరు.. ఈ కార్డులపై అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..!
Contactless Payment: పండగ సీజన్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఈ కొనుగోళ్లలో చాలా మంది డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు..
Contactless Payment: పండగ సీజన్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఈ కొనుగోళ్లలో చాలా మంది డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటి ద్వారానే లావాదేవీలు జరుపుతుంటారు. అయితే కార్డులను వినియోగించడంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వహించినా మోసగాళ్ల చేతిలో పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంటాక్ట్‌లెస్ కార్డులను వాడే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం అన్ని బ్యాంకులూ కాంటాక్ట్‌లెస్ డెబిట్, క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. బిల్లు చెల్లించే సమయంలో దుకాణదారుడి చేతికి ఇవ్వకుండానే రూ.5,000 లోపు బిల్లును అలా కార్డు యంత్రానికి (పీఓఎస్) కాస్త దగ్గరగా చూపించి చెల్లించవచ్చు. పిన్ నమోదు చేయాల్సిన అవసరమూ ఉండదు. కానీ, ఇక్కడే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సాధారణ చిప్ కార్డుతో పోలిస్తే.. ఈ కాంటాక్ట్‌లెస్ కార్డు సురక్షితమే. మీ కార్డు మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి, ఎవరూ దీనిని క్లోన్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే దీనిని ఇతరుల చేతికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. పొరపాటున కార్డు పోతే.. రూ.5 వేల వరకు ఎవరైనా దాన్ని ఉపయోగించుకునే వీలుంటుంది. అందుకే గుర్తించిన వెంటనే కార్డును బ్లాక్ చేయాలి. బ్యాంకు ఆన్‌లైన్ ఖాతాలో లేదా అధీకృత యాప్ ద్వారా కాంటాక్ట్‌లెస్ కార్డును నియంత్రించవచ్చు. అవసరం లేదు అనుకుంటే.. దాన్ని ఆఫ్ చేయవచ్చు.
కార్డు లావాదేవీలు చేసేందుకు ఉపయోగించే పిన్ నెంబర్‌ను ఎవ్వరికి చెప్పకూడదు. నాలుగు అంకెల పిన్‌కు బదులుగా ఆరు అంకెల పిన్‌ను ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పండగల వేళ మీ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఫోన్లు వస్తుంటాయి. అలాంటివి నమ్మవద్దు. బ్యాంకు అధికారులు ఇలాంటి విషయాలలో కాల్స్ చేయరు. వెబ్‌సైట్లు లేదా ఇ-మెయిల్ ద్వారానే బ్యాంకులు సమాచారాన్ని అందిస్తాయి. పండగ సీజన్‌లో కార్డును చాలా వరకు ఉపయోగించుకుంటారు కాబట్టి ఇలాంటి సమయాలను మోసగాళ్లు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. పండగ సీజన్‌లో కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తారనే కారణంగా మీకు కాల్స్ చేస్తూ పిన్, ఇతర వివరాలు చెప్పాలని, లేకుండా మీ లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉందని కాల్స్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి వివరాలు చెప్పవద్దు. లేకపోతే మీరు నిలువునా మోసపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదంలో ఎన్నో జరిగాయి. నష్టపోయిన తర్వాత చేసేదేమి ఉండదు. అనవసరమైన సమయం వృథా అవుతుంది. అజాగ్రత్తగా వహిస్తే లేనిపోని చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.