కేంద్రం గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో మరో కొత్త సామాజిక భద్రతా పథకం ప్రకటించే అవకాశం..!
Budget 2022: కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. పేద,అణగారిన వర్గాల కోసం ప్రారంభించిన ప్రస్తుత పథకాలని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు
Budget 2022: కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. పేద,అణగారిన వర్గాల కోసం ప్రారంభించిన ప్రస్తుత పథకాలని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే లైవ్‌మింట్ నివేదిక ప్రకారం.. అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కోసం కేంద్రం మరో కొత్త పథకం ప్రారంభించడానికి ప్రయత్నిస్తోందని తెలిసింది. దీనిపై అధికారులు చర్చిస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన తుది నిర్ణయాలను బడ్జెట్‌లో పేర్కొనవచ్చు. అయితే ఇందులో రాష్ట్రాలను చేర్చిన తర్వాతే అధికారికంగా లాంచ్ అవుతుందని నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు, వలస కూలీలు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోవడం, ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో మళ్లీ మళ్లీ ఒకచోటి నుంచి మరోచోటికి వెళ్లాల్సి వస్తోంది. దీని కారణంగా కేంద్రం త్వరలో వారి కోసం కొత్త సామాజిక భద్రతా పథకాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం మోడీ ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలు
సమాజంలో అత్యంత అణగారిన వర్గాలను రక్షించడానికి ఇటీవల ప్రవేశపెట్టిన కొన్ని పథకాలలో ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (PMVVY) 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ పథకం ఉన్నాయి. ఇది కాకుండా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రమాద బీమా పథకం ఉంది. దీనిలో రూ. 12 వార్షిక ప్రీమియం అందుబాటులో ఉంది. అటల్ పెన్షన్ యోజన అనేది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజల కోసం ఒక పెన్షన్ కార్యక్రమం.వ్యవసాయ రంగానికి ప్రధాన మంత్రి కిసాన్ పెన్షన్ యోజన కూడా ఉంది. దీని కింద చిన్న, సన్నకారు రైతులకు 60 ఏళ్లు నిండితే నెలకు కనీసం మూడు వేల రూపాయల స్థిర పెన్షన్ లభిస్తుంది. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి సంవత్సరం 145 మిలియన్ల మంది రైతులు ఒక్కొక్కరికి రూ.6,000 అందజేస్తున్నారు.
నేరుగా ఖాతాకు డబ్బు బదిలీ చేయడానికి ప్లాన్
అయితే కొత్త సామాజిక భద్రతా పథకం పిఎం కిసాన్ మాదిరిగానే ఉండవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందులో కొంత డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారని నివేదిక పేర్కొంది. ఇందుకోసం వారు కొన్ని షరతులు పాటించాలి. ప్రజలు ఆదాయాన్ని కోల్పోయిన సమయంలో వారి చేతిలో ఉన్న ఈ మొత్తం వారికి సహాయంగా నిలుస్తుంది. దీంతోపాటు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రస్తుత పథకాలను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. వీటిలో ప్రమాద బీమా కూడా ఉంటుంది. దీంతో పాటు నెలవారీ కంట్రిబ్యూషన్‌ను తగ్గించే యోచన కూడా ఉన్నట్లు తెలిసింది.