బ్యాంక్ యూనియన్లు సంచలన నిర్ణయం.. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు రోజుల ధర్నా.. ఏ తేదీల్లో అంటే..!
Bank Unions 2 Day Strike: బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ యోచనకు నిరసనగా బ్యాంక్..
Bank Unions 2 Day Strike: బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ యోచనకు నిరసనగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు రెండు రోజుల సమ్మెకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ 16, 17 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలోని సేవలు ప్రభావితం కావచ్చని బ్యాంక్ అధికారులు ప్రకటించారు. సమ్మె రోజులలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినప్పటికీ.. బ్యాంకు సేవలపై సమ్మె ప్రభావం ఉండొచ్చని ముందుగానే కస్టమర్లను అలర్ట్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో.. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) ప్రైవేటీకరణను ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ పెట్టుబడులను 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే LICకి సంబంధించి మెజారిటీ వాటాను విక్రయించడం ద్వారా IDBI బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది. ఇక గత నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బిల్లుకు వ్యతిరేకంగా రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెను చేపట్టనున్నట్లు ఈ నెల ప్రారంభంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ మహేశ్ మిశ్రా తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో సమ్మె నిర్వహిస్తామని ప్రకటించారు. ఫ్రెండ్లీ బ్యాంకింగ్ విధానాలతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విధానాలకు బ్యాంక్ యూనియన్లు మద్దతు ఇస్తాయని, అయితే బ్యాంకుల ప్రైవేటీకరణ కాదని మిశ్రా తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపరిచే లక్ష్యంతో తీసుకువచ్చిన బ్యాంకింగ్ సంస్కరణల విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ప్రకటించారు.
ఈ రెండు రోజుల ధర్నాలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO) సంఘాలు పాల్గొననున్నాయి.
Also read:
Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్ స్టార్.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..
Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?