Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయంటే.. ఏ రంగం షేర్లు పెరుగుతాయంటే..
స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారం సానుకూలంగా ప్రారంభం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో అనిశ్చిత అంతర్జాతీయ పరిణామాల మధ్య లాభాలు పరిమితంగానే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు...
స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారం సానుకూలంగా ప్రారంభం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో అనిశ్చిత అంతర్జాతీయ పరిణామాల మధ్య లాభాలు పరిమితంగానే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాంకేతికతంగా ఊగిసలాటలకు అవకాశం ఉన్నా.. సానుకూలం వైపు మొగ్గు కాస్త ఎక్కువగా ఉందని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి. 16,400-16,600 వైపు నిఫ్టీ పయనించొచ్చని.. 16,050 వద్ద మద్దతు లభించొచ్చని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయంగా జనవరి-మార్చి జీడీపీ, మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ , మే నెల జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలు వెలువడనున్నాయి. ఇక అంతర్జాతీయంగా మే నెలకు సంబంధించి అమెరికా పీఎమ్‌ఐ; ఐరోపా సీపీఐ ద్రవ్యోల్బణం, అమెరికా ఉద్యోగ గణాంకాలు.. వెలువడనున్నాయి. మందగమనం రావొచ్చన్న భయాల మధ్య అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వృద్ధిపై చేసే వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. సిమెంటు కంపెనీల షేర్లు ఈ వారం స్తబ్దుగా కనిపించొచ్చు. ధరలు, గిరాకీ సంబంధిత అంశాలు మదుపర్లను జాగ్రత్త వహించేలా చేయవచ్చు. సిమెంటు ధరల పెంపు అవకాశాలు ప్రస్తుతానికి తక్కువగా ఉండడంతో గిరాకీ, విక్రయాల గణాంకాలను గమనించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఉక్కు రంగ ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల నేపథ్యంలో గత వారం దిద్దుబాటుకు గురైన లోహ కంపెనీల షేర్లు ఈ వారం స్తబ్దుగా కనిపించొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా నేడు జిందాల్ స్టీల్ ఫలితాలు వెలువడనున్నాయి. ఎటువంటి ప్రధాన వార్తలూ లేనందున యంత్ర పరికరాల షేర్లు మార్కెట్‌తో పాటే చలించొచ్చని. అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా అప్‌స్ట్రీమ్ కంపెనీల షేర్లు కదలాడవచ్చని. రష్యా చమురు దిగుమతులపై ఈయూ నిషేధం విధించే అవకాశం ఉందని చెబుతున్నారు.టెలికాం షేర్లు మార్కెట్ నుంచే సంకేతాలను అందుకోవచ్చు. 5జీ స్పెక్ట్రమ్ వేలం విధానంపై కేంద్ర కేబినెట్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమోనని మదుపర్లు పరిశీలించొచ్చు. సోమవారం ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. ఇప్పుటికే నష్టాల్లో షేరు హోల్డర్లను సంతృప్తి పరిచేందుకు బోర్డు డివిడెండ్ ప్రకటించే అవకాశం ఉంది.