పెళ్లి ముచ్చట తీరకుండా అమరులైన ఇద్దరు వీర జవాన్లు.. నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన ఆంధ్ర యువకులు

ఛత్తీ‌స్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు.

పెళ్లి ముచ్చట తీరకుండా అమరులైన ఇద్దరు వీర జవాన్లు.. నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన ఆంధ్ర యువకులు
Two Crpf Jawans Belongs To Andhra Pradesh
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 05, 2021 | 8:47 AM

two crpf andhra pradesh jawans:  ఛత్తీ‌స్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. విజయనగరం పట్టణానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ రౌతు జగదీశ్‌(27)కు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చేనెలలో జీవితభాగస్వామితో ఏడుఅడుగులు నడిచేందుకు సిద్ధమయ్యాడు. వచ్చేనెల వివాహం కానుండడంతో ఒకటి రెండు రోజుల్లో ఇంటికి రావాలనుకున్నాడు. అంతలోనే నక్సల్ దాడిలో ప్రాణాలను కోల్పోయాడు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.

గాజులరేగ ఎగువవీధికి చెందిన రౌతు సింహాచలం, రమణమ్మ దంపతులకు కుమారుడు జగదీశ్‌ డిగ్రీ వరకు చదివాడు. దేశ సేవలో తరించాలని తలచాడు. 2010లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. మంచి శరీరసౌష్టవం, చురుకుగా కదిలే నైజంతో కోబ్రాదళం లీడర్‌గా నియమితులయ్యాడు. వచ్చేనెలలో పెళ్లికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 22న వివాహం నిర్ణయించారు. పెళ్లి పనులు చూసుకునేందుకు ఈ నెల 5న ఇంటికి వస్తానని జగదీశ్‌ రెండురోజల కిందటే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పాడు. ఈలోగా ఘోరం జరిగిపోయింది.

బీజాపూర్‌లో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. కొద్దికాలంలోనే మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. పెళ్లి ముచ్చట తీరకుండానే మావోయిస్టుల రూపంలో మృత్యువు కాటేసింది. కుటుంబ సభ్యులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. జవాన్‌ మృతితో విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ, మక్కువ మండలం కంచేడువలసలో విషాదం అలముకుంది. ఆదుకుంటాడనుకున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదే ఘటనలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండర్‌ శాఖమూరి మురళీకృష్ణ(34) మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. శాఖమూరి రవి, విజయ దంపతులకు వెంకటమోహన్‌, మురళీకృష్ణ సంతానం. మురళీకృష్ణ 2010లో సీఆర్‌పీఎ్‌ఫకు ఎంపికయ్యాడు. ఆయనకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇటీవలే ఇంటి నిర్మాణం పూర్తిచేశారు. ఈ వేసవిలో వివాహం జరిపించేందుకు కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారు. 2నెలల క్రితం ఇంటికి వచ్చిన మురళీకృష్ణ ఈ దఫా పెళ్లి చేసుకునేందుకు వస్తానని బంధువులు, స్నేహితులకు చెప్పాడు. ఇంతలోనే ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మురళీకృష్ణ మృతి చెందినట్లు సీఆర్‌పీఎఫ్‌ అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

Read Also…  ఆటాడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు పయనమయ్యారు.. చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి