ఛత్తీస్‌గఢ్ అడవుల్లో రక్తపాతానికి కారకుడు అతడేనా..? గెరిల్లా ఆర్మీ మెరుపుదాడి సూత్రధారి కోసం మొదలైన వేట..!
శనివారం ఛత్తీస్‌గఢ్ అడవుల్లో రక్తపుటేరులు పారిన విషయం తెలిసిందే. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
chhattisgarh encounter: శనివారం ఛత్తీస్‌గఢ్ అడవుల్లో రక్తపుటేరులు పారిన విషయం తెలిసిందే. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. భారీ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలతో పాటు మావోయిస్టుల పెద్ద సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారని సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు. దాదాపు 30 మంది వరకు మరణించిన ఉంటారని.. అయితే, ఖచ్చితంగా ఎంత మంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు మావోయిస్టులు మూడు ట్రాక్టర్‌లను ఉపయోగించారని ఆయన తెలిపారు.
మరోవైపు ఎన్‌కౌంటర్‌లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 24 మంది జవాన్లు బలైపోయారు. మరో 30 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు గాలిస్తున్నాయి. తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి భద్రతా దళాలు.
కాగా, ఏప్రిల్ 2న బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. సుక్మా బీజాపూర్ సరిహద్దులోని సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తో కూడిన 2వేల మంది జవాన్లు అడవులను గాలించారు. ఈ క్రమంలో శనివారం తారెమ్ ప్రాంతంలో 400 సభ్యులతో కూడిన జవాన్ల బృందంపై మావోయిస్టులు మెరుపు దాడిచేశారు. మోస్ట్ వాంటెడ్ కమాండర్ మడ్వి హిడ్మా నేతృత్వంలో ఈ దాడి జరిగింది. సుమారు 5 గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి.
బీజాపూర్ తరెంలో సీఆర్‌పీఎఫ్‌పై భీకరదాడికి సూత్రధారి మడ్వి హిడ్మాగా అనుమానిస్తున్నాయి భద్రతా దళాలు. మావోయిస్టు పార్టీలో భారీ దాడులకు వ్యూహకర్తగా పేరున్న అతడు ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) నంబర్ 1 బెటాలియన్‌కు కమాండర్‌గా, ఛత్తీస్‌గఢ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో జరిగిన భారీ దాడుల్లో హిడ్మా కీలక పాత్ర పోషించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పువర్తి ప్రాంతానికి చెందిన గిరిజనుడు హిడ్మా. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్‌లో చేరాడు. ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రమే పూర్తి చేసిన అతడు.. మావోయిస్టు ఆపరేషన్లలో దిట్టగా పేరొందాడు. యుద్ధ నైపుణ్య మెలకువలను కేడర్‌కు అలవోకగా నూరిపోస్తుంటాడనే పేరుంది. కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే పోలీస్ బలగాలపై, సీఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
దేశీయ ఆయుధాల్ని, ఐఈడీ బాంబుల్ని తయారు చేయడంలో పట్టు కలిగి ఉన్న హిడ్మాను ఒక దశలో పార్టీ కేంద్ర కమిటీలో తీసుకోవాలనే చర్చ జరిగింది. వయసు ఇంకా నాలుగు పదుల్లోనే ఉండటం.. దాడుల్లో దూకుడుగా వ్యవహరిస్తుండటంతో పార్టీ వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని నిఘావర్గాలకు సమాచారం అందింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఉన్నట్లు తెలుస్తున్న హిడ్మాను పట్టించినవారికి రూ.40 లక్షల రివార్డు ప్రకటించింది హోంశాఖ. గతంలో ఛత్తీస్‌గడ్ బీజేపీ ఎమ్మెల్యే భీమా మడవి హత్య కేసులో ఎన్‌ఐఏ అతనిపై అభియోగపత్రం నమోదు చేసింది. శనివారం నాటి దాడిలో దాదాపు 250 మంది కలిగిన పీఎల్‌జీఏ బెటాలియన్‌కు హిడ్మా నేతృత్వం వహించాడని నిఘా వర్గాల అనుమానిస్తున్నాయి.
Read Also… ఇంట్లో గొడవ పడ్డ ఓ యువతి.. నేరుగా వచ్చి గోదావరి నదిలో దూకింది.. అంతలో ఎం జరిగిందంటే..?