ఏపీలో రక్తమోడిన రహదారులు.. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. 11మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. ఆదివారం అర్థరాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు.

ఏపీలో రక్తమోడిన రహదారులు.. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. 11మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రలు
Road Accidents In Andhra Pradesh
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 28, 2021 | 7:35 AM

Road Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. ఆదివారం అర్థరాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఎనిమిది, కృష్ణా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి.

కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలో గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్లమన్నాడు వద్ద వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ప్రయాణికులతో వెళ్తున్న అటోను బలంగా ఢీకొట్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గుడ్లవల్లేరు నుండి పెడన మండలం జింజెరు గ్రామానికి కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటీన సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మృతులు జింజెరు గ్రామానికి చెందిన జన్ను నాంచారయ్య, జన్ను వెంకన్న, మోటుకురు శివ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో, జింజెరు గ్రామం శోక సముద్రంలో మునిగి పోయింది.

అటు, నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెంపో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మృతులంతా తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Read Also… మాటలతో మభ్యపెడతాడు.. అవసరం తెలుసుకుని దగ్గరవుతాడు.. సాయం చేస్తానని నగలతో పరార్‌