మాటలతో మభ్యపెడతాడు.. అవసరం తెలుసుకుని దగ్గరవుతాడు.. సాయం చేస్తానని నగలతో పరార్‌

మహిళలే టార్గెట్‌‌గా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి గుట్టురట్టు అయ్యింది. సాయం ముసుగులో మభ్యబెట్టి ఆభరణాలు అపహరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాటలతో మభ్యపెడతాడు.. అవసరం తెలుసుకుని దగ్గరవుతాడు.. సాయం చేస్తానని నగలతో పరార్‌
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 28, 2021 | 7:05 AM

Interstate thief arrested: మహిళలే టార్గెట్‌‌గా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి గుట్టురట్టు అయ్యింది. సాయం ముసుగులో మభ్యబెట్టి ఆభరణాలు అపహరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస చోరిలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కోట మండలం కోట సిలు రోడ్డు శ్యామ్‌సుందరపురానికి చెందిన చేవూరు చంద్రబాబు(54) బంగారు వ్యాపారి వద్ద కొంత కాలం పనిచేశాడు. మహిళ అవసరాలను అసరాగా చేసుకుని సాయం చేస్తున్నట్లు నటించేవాడు. ఇందుకోసం రకరకాల పేర్లను మార్చుకుంటూ మహిళను లోబర్చుకుని చోరిలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. చేవూరు చంద్రబాబు అలియాస్‌ శేఖర్‌రెడ్డి అలియాస్‌ వంశీకృష్ణ అలియాస్‌ కృష్ణ అలియాస్‌ మురళీగా చెలామణి అయ్యాడు. మహిళలను మోసగిస్తూ.. కేసుల్లో ఇరుకున్నాక భార్య, పిల్లలను 15 ఏళ్ల క్రితమే వదిలేశాడు. వివిధ ప్రాంతాల్లో బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, హోటళ్లు, కూల్‌డ్రింక్‌ షాపుల వద్ద ఉంటూ మహిళల సంభాషణలను గమనిస్తాడు. వారితో మాటలు కలిపి ఫోన్‌ నెంబర్‌ ఇస్తాడు. వారి నుంచి ఫోన్ నెంబర్లు, అడ్రస్ తీసుకుని తన వ్యవహారానికి ఫ్లాన్ చేసుకుంటాడని ఎస్పీ తెలిపారు.

వారి అవసరాన్ని బట్టి నగదు కానీ, బంగారం కానీ ఇస్తూ తరచుగా వారి ఇంటికి వస్తూ కుటుంబ స్థితిగతులను గమనిస్తాడు. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు మాయమాటలతో మత్తు బిళ్లలు ఇస్తాడు. మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఒంటిపై నగలు, ఇంట్లో నగదు, విలువైన వస్తువులు దోచుకెళ్తాడు. తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేస్తాడు. ఇలా నిందితుడిపై ఏకంగా 35కు పైగా నేరాలకు పాల్పడ్డాడని ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. ప.గో. జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.9 లక్షలు విలువైన 223 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు..

Read Also…. అర్థరాత్రి మందుబాబుల వీరంగం… మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. ఏఎస్సైకి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం