Hyderabad Red Alert : హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ : వర్షాలతో ఎమర్జెన్సీ, అత్యవసర బృందాలు అప్రమత్తం : మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాల వల్ల నగర పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలను నియమించి పరిస్థితులను సమీక్షస్తున్నట్టు..
Hyderabad Red Alert : హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాల వల్ల నగర పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలను నియమించి పరిస్థితులను సమీక్షస్తున్నట్టు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెల్లడించారు. సోమాజీగూడ డివిజన్‌లో వరద నీరు నిండిన పలు ప్రాంతాలను, నాలాల పరిస్థితులను స్థానిక కార్పొరేటర్ సంగీత, ఎస్ ఈ రత్నాకర్, ఈఈ ఇందిరా బాయితో కలిసి మేయర్ ఇవాళ పరిశీలించారు.
వాతావరణ శాఖ జారీ చేసిన సమాచారం ప్రకారం నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అతి భారీ వర్షాల వలన ఏర్పడే వరద పరిస్థితిని ఎదుర్కునేందుకు అధికారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంచేసి, అందుబాటులో ఉంచాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లను కోరామని మేయర్ తెలిపారు.
నగరంలోని చెరువుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని మేయర్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నీటిని తోడి వేయడానికి మోటార్లను కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎం.ఎస్. మక్తా, పార్క్ హోటల్ సమీపంలోని నాలాను పరిశీలించి, మోటర్ లతో నీళ్లు నిలిచిన ప్రదేశాలను క్లియర్ చేయాలని విజయలక్ష్మి ఆదేశించారు. ఎమ్మెస్ మక్తాలో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని మేయర్ ఆదేశించారు.
పార్క్ హోటల్ దగ్గర నాల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ తెలిపారు. వర్ష సంబంధిత సమస్యలుంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040 21111111 నెంబర్ కు ఫోన్ చేయొచ్చని తెలిపారు.