మహానగరాలకు మహా ముప్పు… వైరస్ నియంత్రణ సాధ్యమా?
కరోనా మహమ్మారి నుంచి దేశం బయట పడుతుందా ? ఇపుడు కొనసాగుతున్న ట్రెండ్, ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాల ఉల్లంఘన, అందుబాటులో వున్న గణాంకాలను చూస్తే ఆందోళన కలుగక మానదు. ముఖ్యంగా దేశంలోని పలు ప్రధాన మెట్రొపాలిటన్ నగరాలు కరోనా ముప్పు నుంచి అసలు బయటపడతాయా?

కరోనా మహమ్మారి నుంచి దేశం బయట పడుతుందా ? ఇపుడు కొనసాగుతున్న ట్రెండ్, ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాల ఉల్లంఘన, అందుబాటులో వున్న గణాంకాలను చూస్తే ఆందోళన కలుగక మానదు. ముఖ్యంగా దేశంలోని పలు ప్రధాన మెట్రొపాలిటన్ నగరాలు కరోనా ముప్పు నుంచి అసలు బయటపడతాయా? అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చూస్తే వారి సందేహాలలో వాస్తవం వుందన్న అభిప్రాయం కలుగక మానదు.
గురువారం సాయంత్రానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 21 వేల దాటింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ఢిల్లీ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు తోడు కాగా.. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందన్న అభిప్రాయం కలుగుతోంది. దేశంలో 429 జిల్లాలకు కరోనా విస్తరించింది. దేశ భూభాగంలో మొత్తం 58 శాతం భూభాగానికి కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యింది. ఇందులో 25 శాతం కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.21 శాతం కేసులు కేవలం 12 రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఇదంతా ఒక లెక్కైతే..నగరాల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
కరోనా పాజిటివ్ కేసులు నగరాల్లోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. నగరాల్లోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా ఎందుకు నమోదు అవుతున్నాయి? అసలు కరోనా బాధితుల సంఖ్య పెరగకుండా కంట్రోల్ చేయడమే ఒక చాలెంజ్ అయితే.. నగరాల్లోనే ఎక్కువగా ఎందుకు పెరుగుతున్నాయనేది మరో చాలెంజ్. దేశంలో నమోదైన కేసుల్లో ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల నుంచే మూడో వంతు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నగరాల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే.. అత్యధికంగా 3451 పాజిటివ్ కేసులు ముంబైలో నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో ఎక్కువగా 2272 మందికి కరోనా సోకింది. ఆ తర్వాతి స్థానంలో అహ్మదాబాద్ 1378, ఆ తర్వాత ఇండోర్ లో 923, ఆ తర్వాత పుణె 716, తర్వాత జైపూర్ 657, హైదరాబాద్ 498, చెన్నై 358, సూరత్ 347, ఆగ్రాలో 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఆయా నగరాల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులను అంచనా వేసిన కేంద్రం.. ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిచడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు తీవ్రంగా ఉందని హెచ్చరించింది. సామాజిక దూరం పాటించకపోవడం, పట్టణాల్లో భారీగా వాహనాల రోడ్లపైకి రావడం లాంటి ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ చెప్తోంది. ఇంతకీ నగరాల్లో కేసులు పెరగడానికి కారణాలేంటి? అని విశ్లేషిస్తే.. విదేశాల నుంచి వచ్చిన వారు ముందుగా నగరాలకే చేరుకుంటారు. ముంబై వంటి నగరాలను దగ్గరగా పరిశీలిస్తే.. అక్కడకు వచ్చి పోయే వారి సంఖ్య ఎక్కువగా వుంది. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చినవారు కూడా నగరాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత నగరాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న కారణంగా.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమౌతుంది.
ఇంకో ప్రధాన కారణం పల్లెల్లో లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో అమలవుతున్నా.. నగరవాసులు మాత్రం దీన్ని బ్రేక్ చేస్తున్నారు. ఆ కారణంగా కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..కరోనా వైరస్ వ్యాప్తి చెందిన నగరాల్లో ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించనుందని చెప్తోంది. ఈ ప్రాంతాల్లో 6 ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్‌ను ఏర్పాటుచేసి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అవసరమైన సూచనలు చేస్తోంది.
ఈ బృందాలు తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్ అమలుపై ఈ IMCT దృష్టి సారించనున్నాయి. నిత్యావసరాల సరఫరా, సామాజిక దూరం, ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధత, ఆరోగ్య నిపుణుల భద్రత, నిరుపేదలు, కూలీల సహాయ శిబిరాల పరిస్థితుల గురించి నివేదిక రూపొందించి కేంద్రానికి అందజేయనున్నాయి.




