Dhana Yoga: రాశినాథుడికి బలం.. ఆ రాశులకు రాజయోగాలు, ధన యోగాలు..!
Zodiac Rulers Strong: రాశినాథుడు బలంగా ఉన్నప్పుడు జాతక దోషాలు తొలగి, శుభ యోగాలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ప్రస్తుతం 6 రాశులు (మేషం, వృషభం, తుల, వృశ్చికం, మకరం, మీనం) రాశినాథుడి అనుకూల స్థానం వల్ల రాజయోగాలు, ధనయోగాలు పొంది, ఊహించని సంపద, ఉన్నత స్థితిని సాధిస్తాయి. ఈ ప్రత్యేక యోగాలు జీవితాన్ని మెరుగుపరుస్తాయి.

Telugu Astrology
రాశినాథుడు బలంగా, అనుకూలంగా ఉన్న పక్షంలో జాతకంలో ఎన్ని దోషాలున్నా కొట్టుకుపోతాయని, శుభ యోగాలు ఎక్కువగా కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. రాశినాథుడు బలహీనంగా ఉన్నప్పుడు శుభ యోగాలేవీ పని చేయవు. ఉచ్ఛ, స్వక్షేత్ర, మిత్ర క్షేత్రాల్లో ఉన్నప్పుడు రాశినాథుడు బలవంతుడవుతాడు. నీచలో గానీ, శత్రు క్షేత్రంలో గానీ, దుస్థానంలో గానీ ఉన్నప్పుడు రాశినాథుడు బలహీనపడతాడు. ప్రస్తుతం ఆరు రాశులకు రాశినాథుడు బలంగా ఉన్నందువల్ల వీరికి ప్రతి యోగమూ అత్యుత్తమ ఫలితాలనిస్తుంది. మేషం, వృషభం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు ప్రస్తుతం రాశినాథుడు అనుకూలంగా ఉన్నాడు.
- మేషం: రాశ్యధిపతి కుజుడు తన స్వస్థానమైన వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నందువల్ల మరో రెండు నెలల పాటు ఈ రాశివారికి తప్పకుండా రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఊహిం చని విధంగా సంపద పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు జీతభ త్యాలు కూడా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- వృషభం: ఈ రాశ్యధిపతి శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తున్నందువల్ల, మరో నెల రోజుల పాటు ఈ రాశివారి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆదాయం వృద్ది చెందుతుంది. మహా భాగ్య యోగం పడుతుంది. ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి.
- తుల: ఈ రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ నెల 26 వరకు వీరి జీవితం ఒక వెలుగు వెలుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవు తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. సంపద పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
- వృశ్చికం: ఈ రాశ్యధిపతి కుజుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల సర్వత్రా ఈ రాశివారి ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశముంది. సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మకరం: రాశ్యదిపతి శనీశ్వరుడు తృతీయ స్థానంలో, మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి లోటూ ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు రాణిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది.
- మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ది చెందుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమై, మనశ్శాంతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి.



