Zodiac Signs: మీ సొంతింటి కల నెరవేరేదెప్పుడు..? ఆ రాశులవారికి అత్యంత అనుకూల సమయం ఇదే..!
సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుంది? ఇల్లు కొంటామా, ఫ్లాట్ కొంటామా? తక్కువ ఖర్చుతో కొంటామా, ఎక్కువ ఖర్చుతో కొంటామా? ఈ ప్రశ్నలకు గ్రహ సంచారం ఏమని సమాధానం చెబుతోంది? వివిధ రాశులకు ఇల్లు ఎప్పుడు ఏ విధంగా అమరుతుందో ఇక్కడ పరిశీలిద్దాం.
సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుంది? ఇల్లు కొంటామా, ఫ్లాట్ కొంటామా? తక్కువ ఖర్చుతో కొంటామా, ఎక్కువ ఖర్చుతో కొంటామా? ఈ ప్రశ్నలకు గ్రహ సంచారం ఏమని సమాధానం చెబుతోంది? వివిధ రాశులకు ఇల్లు ఎప్పుడు ఏ విధంగా అమరుతుందో ఇక్కడ పరిశీలిద్దాం. సాధారణంగా జాతక చక్రంలో నాలుగో స్థానాన్ని బట్టి, గృహ కారకుడైన గురు గ్రహాన్ని బట్టి గృహ యోగం గురించి చెప్పాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా వివిధ రాశులకు ఎప్పుడు గృహయోగం పడుతుందో చూద్దాం.
- మేష రాశి: గృహ కారకుడైన గురు గ్రహం ఈ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ ఏడాది తప్ప కుండా వీరికి గృహ యోగం పట్టే సూచనలు ఉన్నాయి. సొంత ఇంటి కోసం కొద్దిగా ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఇంటి కోసం చేసే రుణ ప్రయత్నం అతి త్వరగా విజయవంతం అవు తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఇండిపెండెంట్ హౌస్ కోసం ప్రయత్నం చేయడం మంచిది. ఎంత త్వరగా ప్రయత్నాలు మొదలు పెడితే అంత మంచిది. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ రాశి వారు ఒక ఇంటి వారయ్యే అవకాశం ఉంది.
- వృషభ రాశి: ఈ రాశి వారు సొంత ఇంటి కోసం ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభిస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. సాధారణంగా ఫ్లాట్ కొనడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత ప్రణాళిక బద్ధంగా కృషి చేసినప్పటికీ ఇంటిపై చేసే ఖర్చు రెట్టింపు కావడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏడాది వీరు ఒక ఇంటి వారు అయ్యే సూచనలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మే నెలల మధ్య సొంత ఇంటి కల నెరవేరుతుందని చెప్పవచ్చు. రుణ సౌకర్యం పొందడం ద్వారానే ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
- మిథున రాశి: ఈ రాశి వారు సొంత ఇంటి కోసం ఇప్పటికే మొదలుపెట్టిన ప్రయత్నాలు అతి త్వరలో సఫలం అయ్యే అవకాశం ఉంది. భారీ ఖర్చుతో ఫ్లాట్ కొనటానికి అవకాశం ఉంది. ఇండిపెండెంట్ హౌస్ కోసం ప్రయత్నించినప్పటికీ అది నెరవేరే సూచనలు ఉన్నాయి. అక్టోబర్ నెల లోపల సొంత ఇంటి యజమాని అయ్యే అవకాశం ఉంది. అభిరుచులకు తగ్గట్టుగా ఇల్లు దొరకవచ్చు. రుణ సౌకర్యం కూడా త్వరలో లభించవచ్చు. ఏది ఏమైనా సొంత ఇంటి కోసం ప్రయత్నం చేయడానికి ఇది అన్ని విధాలుగాను అనుకూల సమయం.
- కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ ఏడాది చివరిలోగా ఇల్లు లేదా ప్లాట్ కొనడానికి అవకాశం ఉంది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా ఇంటి యజమాని కావడం మాత్రం ఖాయం అని చెప్పవచ్చు. ఇంటి మీద భారీగా ఖర్చుకావడానికి అవకాశం ఉంది. రుణ సౌకర్యం పొందే విషయంలో కొన్ని చిక్కులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా ఓర్పు సహనా లతో వ్యవహరిస్తే తప్పకుండా ఒక ఇంటి యజ మాని అవడానికి ఆస్కారం ఉంది. వాస్తవానికి సొంత ఇంటి కల నెరవేరటానికి వచ్చే ఏడాది కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంది. గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది.
- సింహ రాశి: ఈ రాశి వారి సొంత ఇంటి ప్రయత్నం అనుకో కుండా నెరవేరుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉన్నందువల్ల సొంత డబ్బుతో మంచి ఫ్లాట్ కొనడానికి అవకాశం ఉంది. అవసరమైతే అతి తక్కువ కాలంలో రుణ సౌకర్యం పొందడానికి కూడా వీలుంది. జూలై, అక్టోబర్ నెలల మధ్య తప్పకుండా ఇంటి యజమాని అయ్యే సూచనలు ఉన్నాయి. ఇంటి మీద ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం లేదు. మొత్తం మీద గృహ యోగానికి వీరికి సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. ఎంత త్వరగా ప్రయత్నం మొదలుపెడితే అంత మంచిది.
- కన్యా రాశి: ఇల్లు కొనే విషయంలో ఈ రాశి వారికి వచ్చే ఏడాది ఉన్నంత అనుకూలత ఈ ఏడాది లేదనే చెప్పవచ్చు. ఇల్లు కొనే విషయంలో ఈ ఏడాది ఈ రాశి వారి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. గట్టి ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా నష్టపోవడం, కుటుంబంలో ఇతరత్రా సమస్యలు తలెత్తడం వంటివి జరగవచ్చు. వచ్చే ఏడాది మే నెల గడిచే వరకు గృహ ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. గృహ కారకుడైన గురు గ్రహం అష్టమరాశిలో ఉండటం వల్ల గృహప్రయత్నాల విషయంలో అష్ట కష్టాలు పడటం జరుగుతుంది.
- తులా రాశి: గృహ యోగానికి ఈ రాశి వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అప్రయత్న ధనలాభం కారణంగా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. సాధారణంగా ఒక మోస్తరు ఖర్చుతో ఈ ఏడాది నవంబర్లోగా ఒక ఇంటి వారే అవకాశం ఉంది. అయితే ఇంటిని కొనుగోలు చేసే విషయంలో సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలు చాలా మంచిది. ఇతరుల మీద ఆధారపడే పక్షంలో డబ్బు నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. అందమైన, విశాలమైన ఇంటిని సమకూర్చుకునే అవకాశం ఉంది. ఇంటి కోసం ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి సమయం.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారి స్వగృహ ప్రయత్నాలు అంతగా సఫలం అయ్యే సూచనలు కనిపించడం లేదు. సొంత ఇంటి కోసం మరో ఏడాది నిరీక్షించడం మంచిది. సమయం అనుకూలంగా లేనందువల్ల అడ్వాన్స్ ఇవ్వడం లాంటి లావాదేవీలు పెట్టుకోవడం కూడా శ్రేయస్కరం కాదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఒక పాత ఇంటిని మరమ్మతులు చేయించుకోవడం, పునర్నిర్మాణం చేపట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. లేదా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ను కొనే సూచనలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఒక ఇంటి యజమాని కావడానికి ఓ ఏడాది కాలం ఆగటం మంచిది.
- ధనుస్సు రాశి: ఈ రాశి వారు అతి త్వరలో ఇంటి యజమాని అయ్యే అవకాశం ఉంది. గృహ యోగంతో పాటు వాహన యోగం కూడా పట్టే సూచనలు కనిపిస్తు న్నాయి. ఎక్కువగా సొంత ఇంటి కొనుగోలుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా రుణ సౌకర్యం పొందటానికి వీలుంది. సొంత ఇంటి కోసం ఎంత త్వరగా ప్రయత్నాలు ప్రారంభిస్తే అంత మంచిది. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందడం, ఇతరత్రా ఆదాయం పెరగటం, డబ్బు కలిసి రావడం వంటి కారణాలవల్ల సొంత ఇంటి మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. బహుశా జూలై, ఆగస్టు నెలలో గృహప్రవేశం చేసే సూచనలు ఉన్నాయి.
- మకర రాశి: సొంత ఇంటి కోసం గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇచ్చే సూచనలు ఉన్నాయి. భారీగా రుణ సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. జూలై తరువాత తప్పకుండా ఇంటి యజమాని కావడానికి వీలుంది. ఈ రాశి వారికి గృహస్థానంలో అంటే నాలుగవ స్థానంలో రెండు శుభగ్రహాలు కలిసి ఉండటం వల్ల తప్పకుండా గృహ యోగం కలుగుతుంది. ఇంటిని కొనుగోలు చేసే విషయంలో సొంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. స్నేహితులు లేదా బంధువుల కారణంగా కొంత డబ్బు నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
- కుంభ రాశి: ఇంటి విషయంలో ఈ రాశి వారు మరికొద్ది కాలం నిరీక్షించడం మంచిది. గృహ యోగానికి గ్రహ సంచారం ఆశించినంతగా అనుకూలంగా లేదు. వచ్చే ఏడాది జూలై వరకు ప్రయత్నం చేయక పోవడం మంచిది. ఈ ఏడాది గృహ ప్రయత్నం చేయడం వల్ల ఆర్థిక నష్టం, అశాంతి, అసంతృప్తి వంటివి అనుభవానికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంటి కోసం ప్రయత్నించడంలో శ్రమ, తిప్పట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఎవరి కారణంగానో మోసపోయే అవకాశం కూడా ఉంది. ఏలినాటి శని కారణంగా గృహ ప్రయ త్నాలు మందకొడిగా ముందుకు సాగే అవకాశం కూడా ఉంది.
- మీన రాశి: కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారికి తప్పకుండా గృహ యోగం పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్లోగా గృహప్రవేశం చేసే సూచనలు ఉన్నాయి. భారీ ఖర్చుతో, భారీ రుణంతో ఇంటి యజమాని కావడం జరుగుతుంది. గృహ యోగం తో పాటు వాహనయోగం కూడా చోటు చేసుకో వచ్చు. ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించి ఉన్న పక్షంలో జూలై నాటికి సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో, అతి తక్కువ కాలంలో, అతి తక్కువ ప్రయత్నంతో ఇంటి యజమాని అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ ప్రయత్నం మొదలు పట్టిన దగ్గర నుంచి ఆర్థికంగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..