Astrology: కుజ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారి కోరికలు తీరడం ఖాయం!
Career Growth and Wealth Boost: ధనూ రాశిలో కుజ, శుక్ర గ్రహాల కలయిక జనవరి 12 వరకు 6 రాశులకు అద్భుత శుభ పరిణామాలను తెస్తుంది. మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారు కెరీర్, ధనం, కుటుంబం, ప్రేమ సంబంధాల్లో అనూహ్య వృద్ధిని చూస్తారు. ఈ గ్రహ సంచారం ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపార లాభాలు, ఆస్తి లాభాలతో పాటు రాజయోగాలను ప్రసాదిస్తుంది.

Career Growth And Wealth Boost
కుజ, శుక్రులు ఏ రాశిలో కలిసినా ఏదో ఒక విశేషం జరుగుతుంది. జీవితం మీద ప్రభావం చూపే శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం ధనూ రాశిలో సంచారం చేస్తున్న కుజ, శుక్ర గ్రహాలు జనవరి 12 వరకు అదే రాశిలో కొనసాగుతాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల సాధారణంగా మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారిలో ఆశలు, కోరికలు పెరుగుతాయి. తమ లక్ష్యాలను ఏదో విధంగా సాధించుకోవాలన్న పట్టుదల కలుగుతుంది. ఆదాయం, ఉద్యోగం, గృహం, కుటుంబం, సంతానం వంటివి వృద్ధి చెందడం జరుగుతుంది.
- మేషం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో శుక్రుడితో యుతి చెందడం వల్ల జనవరి 12 లోపు ఈ రాశి వారి జీవితంలో కొన్ని కీలక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశివారికి కెరీర్ పరంగా రాజయోగాలు, ధన యోగాలు తప్పకుండా కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనుకోకుండా ఆస్తి లాభం కలుగుతుంది.
- సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, శుక్రులు కలవడం వల్ల, ఈ రాశివారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. డిమాండ్ పెరగడం, పదోన్నతులు కలగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. సంపన్నుల కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో కుజుడితో కలవడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. రావాల్సిన డబ్బంతా చేతికి అందుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో శుక్రుడితో కలవడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగపరంగానే కాక, సామాజికంగా కూడా రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో అందలాలు ఎక్కుతారు. ప్రముఖులుగా గుర్తింపు పొందుతారు. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి.
- ధనుస్సు: ఈ రాశిలో కుజ, శుక్రులు కలవడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఉన్నతస్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
- కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, కుజుల యుతి దృష్టి వల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గౌరవం దక్కుతుంది. హోదాతో పాటు జీతభత్యాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.



