Love Horoscope: ప్రేమ జీవితానికి మంచి రోజులు.. లవ్ ప్రపోజ్ చేసేందుకు వారికి ఇదే బెస్ట్ టైమ్..!
ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు మిధున రాశిలో శుక్ర చంద్రుల కలయిక జరుగుతుంది. ఎవరి జాతక చక్రంలో అయినా శుక్ర చంద్రులు కలిసి ఉంటే వారు జీవితాంతం రొమాంటిక్ మూడ్ లోనే ఉంటారని చెబుతారు. శృంగార జీవితాన్ని పూర్తిస్థాయిలో అనుభవించాలంటే ఈ రెండు గ్రహాల కలయిక అందుకు దోహదం చేస్తుంది.
ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు మిధున రాశిలో శుక్ర చంద్రుల కలయిక జరుగుతుంది. ఎవరి జాతక చక్రంలో అయినా శుక్ర చంద్రులు కలిసి ఉంటే వారు జీవితాంతం రొమాంటిక్ మూడ్ లోనే ఉంటారని చెబుతారు. శృంగార జీవితాన్ని పూర్తిస్థాయిలో అనుభవించాలంటే ఈ రెండు గ్రహాల కలయిక అందుకు దోహదం చేస్తుంది. ఇది కొంత వరకు గ్రహచారంలో కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం 24వ తేదీ వరకు మిధున రాశిలో శుక్ర చంద్రుల కలయిక జరగటం వల్ల ప్రేమ సంబంధమైన వ్యవహారాలకు మంచి కాలంగా చెప్పవచ్చు. ప్రేమ గురించి మనసు విప్పి మాట్లాడుకోవడం, పెళ్లి గురించి ఆలోచించడం, పెళ్లి మాటలు మాట్లాడుకోవడం, పెళ్లి నిశ్చయం చేసుకోవడం వంటి విషయాలకు ఈ మూడు రోజులు చాలా మంచి రోజుల కింద భావించవచ్చు. ఒక్కొక్క రాశికి ఇది ఏ విధంగా వర్తిస్తుంది అనేది ఇక్కడ పరిశీలిద్దాం.
మేష రాశి: ఈ రాశి వారికి ప్రేమ మాటలు చెప్పుకోవడానికి ఇది చాలా మంచి సమయం. ప్రేమ విషయం బయట పెట్టడానికి, మనసులోని విషయాన్ని చెప్పుకోవడానికి ఇది చాలావరకు అనుకూలమైన సందర్భం అని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రేమ వ్యవ హారాలలో ఉన్నవారు పెళ్లి గురించి మాట్లాడు కోవడానికి కూడా ఇది శుభ సమయం. మళ్లీ చాలా రోజులకు గానీ ఇటువంటి మంచి రోజులు అందుబాటులోకి రాకపోవచ్చు. ఈ సమయంలో మనసు విప్పి మాట్లాడుకునే పక్షంలో అది తప్పకుండా శుభకార్యాలకు, శుభపరిణామాలకు దారి తీస్తుంది.
వృషభ రాశి: ప్రేమ వ్యవహారాలు విజయవంతం కావడానికి చాలా మంచి సమయం. మనసులోని మాట బయట పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం దొరకకపోవచ్చు. మనసులోని మాట బయట పెడితే తప్పకుండా మీదే విజయం అవుతుంది. ఇప్పుడు చెప్పుకోగలిగితే ప్రేమ జీవితం సాఫీగా ఆనందంగా గడిచిపోవడం ఖాయం. ఎంత తొందర పడితే అంత మంచిది. ఇక ఇప్పటికే ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు పెళ్లి మాటలు మాట్లాడుకోవడం కూడా చాలా మంచిది. సమయం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది.
మిథున రాశి: అటు ప్రేమలకు ఈ పెళ్లిళ్లకు ఈ రాశి వారికి సమయం పూర్తిగా అనుకూలంగా ఉంది. ఎంత తొందరగా ప్రేమ విషయం వ్యక్తం చేస్తే అంత మంచిది. ఈ సమయంలో ప్రేమలో పడ్డ వారి జీవితం తప్పకుండా పెళ్లికి దారి తీస్తుంది. పెళ్లి మాటలు కూడా విజయవంతం అవుతాయి. ప్రేమ జీవితం హ్యాపీగా ముందుకు సాగాలన్న పక్షంలో ఈ మూడు రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రేమను వ్యక్తం చేయడం వల్ల శుభమే జరుగుతుంది గాని నష్టం ఉండదు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ సమయం కొద్దిగా మిశ్రమంగా ఉంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంతవరకు మనసులోనే ఉన్న ప్రేమ గురించి బయటకు చెప్పడం వల్ల ఇరకాట పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఆటంకాలు, అవరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రేమ మాటలకు గాని, పెళ్లి మాటలు గాని ఈ రాశి వారికి ప్రస్తుతానికి సమయం ఏమంత అనుకూలంగా లేదు. వేచి చూసే ధోరణి మంచిది. ఇది పెళ్లి మాటలకు కూడా వర్తిస్తుంది. కొద్ది రోజులపాటు యధాతధ స్థితిని కొనసాగించడం అవసరం.
సింహ రాశి: ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది అన్ని విధాల అనుకూలమైన సమయం. సందేహించాల్సిన అవసరం లేదు. ప్రేమ వ్యవహారంలో కుండబద్దలు కొట్టడమే మంచిది. మీ అభిప్రాయానికి, మీ మాటకు విలువ, గౌరవం ఉంటాయి. విజయం మీ సొంతమవుతుంది. అందువల్ల మీ మనసు లోని మాటలను, కోరికలను బయట పెట్టడమే మంచిది. మీ మాట కోసం అవతలి వారు ఎదురుచూస్తున్న విషయాన్ని విస్మరించవద్దు. పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయం. ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.
కన్యా రాశి: ఈ రాశి వారు ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది అనుకూలమైన సమయం. ధైర్యంగా మనసులోని మాట బయట పెట్టవచ్చు. ఆశాభంగం కలిగే అవకాశం లేదు. ఈ రాశి వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. అయితే, పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు. ఇందుకు కొంతకాలం ఆగటం మంచిది. ప్రేమ వ్యవహారాలు మాత్రం దూసుకుపోయే అవకాశం ఉంది. ఈ ప్రేమ తప్పకుండా విజయవంతం అవుతుంది. ప్రస్తుత మూడు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మొదలుపెట్టిన ప్రేమ వ్యవహారం తప్పకుండా శుభ పరిణామాలకు దారితీస్తుంది.
తులా రాశి: ఈ రాశి వారు కొద్ది ప్రయత్నంతో ప్రేమ భాగ్యాన్ని దక్కించుకుంటారు. ప్రేమ పరంగా లేదా పెళ్లి పరంగా ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా విజయవంతం అవుతుంది. ఎక్కడా, దేనికీ సంశయించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మీ మనసులోని మాటను వ్యక్తం చేయవచ్చు. పెళ్లి విషయాలు కూడా తప్పకుండా జయప్రదం అవుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి అదృష్టాన్ని కూడా కలగజేస్తాయి. ప్రేమ జీవితం తప్పకుండా సుఖమయం అవుతుంది. సమస్యలకు, దోషాలకు ఆస్కారం లేదు.
వృశ్చిక రాశి: ప్రేమ వ్యవహారాలలోనూ, పెళ్లి వ్యవహారాల లోనూ ఈ రాశి వారు ఆచితూచి అడుగు వేయడం మంచిది. ప్రేమ వ్యవహారం మీరు అనుకున్నట్టు సాగే అవకాశం తక్కువగా ఉంది. ప్రేమను వ్యక్తం చేయడం వల్ల ఆశాభంగం కలిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రేమను వ్యక్తం చేయడానికి మరికొంత కాలం ఓపికగా నిరీక్షిం చడం చాలా మంచిది. ప్రస్తుతానికి సమయం అనుకూలంగా లేదు. పెళ్లి మాటలను కూడా వాయిదా వేయటం మంచిది. పెళ్లి మాటలలో విసుగులు చికాకులు తలెత్తే ప్రమాదం ఉంది. కొద్దికాలం ఆగితే సమయం మీకు అనుకూలంగా మారుతుంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. నిర్భయంగా ప్రేమను వ్యక్తం చేయవచ్చు. విజయం తప్పకుండా వరిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా ముందుకు సాగాలన్న పక్షంలో ఈ మూడు రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రేమ మాటలు మాట్లాడుకోవడానికి, మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవ డానికి ఈ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన కాలం. పెళ్లి మాటలకు కూడా ఇది చాలావరకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. పెళ్లి ఖరారు విషయంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్న పక్షంలో అవి సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
మకర రాశి: ప్రేమ జీవితంలోకి ప్రవేశించడానికి, మనసులోని ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ఇదివరకే ప్రేమలో ఉన్న వారికి కూడా తరచూ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మనసులోని మాటను బయట పెట్టడానికి కొద్ది రోజులు నిరీక్షించడం మంచిది. ఆ తర్వాత అంతా సానుకూలం అవుతుంది. మనసులోని ప్రేమను వ్యక్తం చేసే పక్షంలో అది బెడిసి కొట్టడానికి అవకాశం ఉంది. పెళ్లి మాటల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించటం మంచిది. అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. తొందరపడి నిర్ణయం తీసుకోకపోవడం చాలా మంచిది.
కుంభ రాశి: ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. అనుకోకుండా మనసులోని ప్రేమను వ్యక్తం చేయడానికి అవకాశం దొరుకుతుంది. ప్రేమను బయట పెట్టడానికి ఈ మూడు రోజుల సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఆ తరువాత ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోయే సూచనలు ఉన్నాయి. అందువల్ల ప్రేమ వ్యక్తీకరణ గురించి అనుమానాలు, సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి మాటలకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు గనుక పెళ్లి ఖాయం అయితే ఆ వివాహ బంధం ఆనందంగా కొనసాగటానికి అవకాశం ఉంటుంది.
మీన రాశి: ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా ఆశాభంగం కలిగే సూచనలు ఉన్నాయి. సమయం అనుకూలంగా లేదు. సాధారణంగా ప్రేమకు అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవతలి వ్యక్తి త్వరగా బయటపడే అవకాశం లేదు. అందువల్ల కొద్దికాలం నిరీక్షించడం మంచిది. ప్రేమను వ్యక్తం చేయలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఇక పెళ్లి మాటలు కూడా ఆశించినంతగా విజయవంతం అయ్యే సూచనలు కనిపించడం లేదు. పెళ్లి మాటలలో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. తొందరపడి మనసులోని మాటలను బయట పెట్టవద్దు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి.