Guru Transit 2025: గురు బలం.. ఆ రాశుల వారికి సంతాన యోగాలు పక్కా..!
Jupitar Transit 2025: మే 25న గురువు మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి సంతాన సంబంధిత శుభ ఫలితాలు ఉంటాయి. సంతాన లేమితో బాధపడుతున్నవారు తప్పనిసరిగా సంతాన ప్రాప్తిని పొందే అవకాశముంది. అలాగే పిల్లల విద్య, ఉద్యోగం, వృద్ధిలో మంచి పరిణామాలకు అవకాశముంది. గురు, గణపతి పూజలు చేయడం శుభప్రదం.

Jupiter in Gemini 2025
మే 25న పుత్ర కారకుడు గురువు ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో ప్రవేశించి ఏడాది పాటు అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. గురువు ద్విస్వభావ రాశిలో ప్రవేశించినప్పుడు సాధారణంగా కవల పిల్లలు పుట్టడం జరుగుతుందని, సంతాన బాహుళ్యానికి కూడా అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఏది ఏమైనా, సంతాన సంబంధమైన అంశాలకు గురువు మిథున రాశి ప్రవేశంతో బలం కలుగుతుంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి మే 25 నుంచి ఏడాది పాటు సంతానానికి సంబంధించి అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు.
- వృషభం: ఈ రాశికి కుటుంబ స్థానంలో పుత్ర కారకుడైన గురువు సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతాన లేమితో బాధపడుతున్నవారికి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, వారు వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానం లేని వారు గురు గ్రహానికి ప్రదక్షిణలు చేయడం, గణపతి స్తోత్రం పఠించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.
- మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఈ ఏడాది సంతాన యోగం కలగడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు సాధారణంగా అత్యంత బలంతో వ్యవహరించడంతో పాటు శీఘ్ర ఫలితాలనిస్తాడు. జాతక చక్రాన్ని బట్టి ఈ రాశికి చెందిన కొందరికి కవల పిల్లలు జన్మించే అవకాశం కూడా ఉంది. పిల్లలు చదువుల్లోనూ, వృత్తి, ఉద్యోగాల్లోనూ బాగా వృద్ధిలోకి వ్యవహరించే అవకాశం ఉంది. ఈ రాశివారికి గురు ప్రదక్షిణల వల్ల లాభం కలుగుతుంది.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంతవరకూ సంతానం కలగని వారు ఈ ఏడాది చివరి లోగా సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త వినడం జరుగుతుంది. పిల్లలున్న వారు పిల్లల పురోగతికి, పిల్లల విజయాలకు సంబంధించి ఆశించిన సమాచారాలు అందుకుంటారు. చదువుల్లోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో సైతం అగ్రస్థానంలో ఉంటారు. ఈ రాశివారు తరచూ గణపతి స్తోత్రం పఠించడం మంచిది.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంత వరకూ సంతాన లేమితో బాధపడుతున్నవారు తరచూ గురువుకు ప్రదక్షిణలు చేయడం, గణపతిని పూజించడం వల్ల తప్పకుండా సంతానాన్ని పొందుతారు. ఇతరుల విషయానికి వస్తే, పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. పిల్లల్లో ఒకరు చదువులు లేదా ఉద్యోగాల విషయంలో విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారికి మే తర్వాత సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఇంతవరకూ సంతానం లేనివారు విష్ణు సహస్ర నామం పఠించడం చాలా మంచిది. చదువులు, ఉద్యోగాలకు చెందిన పోటీ పరీక్షల్లో పిల్లల ఘన విజయాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో ఒకటి రెండు శుభ కార్యాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానంలో ఒకరు విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల రీత్యా స్థిరపడే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల తప్పకుండా సంతానం కలిగే అవకాశం ఉంది. పంచమ స్థానం అత్యంత శుభ స్థానమైనందువల్ల గురువు అతి త్వరలో సంతాన ప్రాప్తికి అవకాశం కలిగించే అవకాశం ఉంది. సంతానం కలిగినవారికి పిల్లల విజయాలకు, సాఫల్యాలకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. చదువుల్లోనే కాక, ఉద్యోగాల్లోనూ బాగా పురోగతి చెందడం జరుగుతుంది. సంతానం లేనివారు ప్రతి గురువారం గురు గ్రహానికి ప్రదక్షిణలు చేయడం మంచిది.