Telugu Astrology: ఉచ్ఛ స్థితిలో రవి.. ఆ రాశుల వారికి సమస్యలు జాగ్రత్త..!
Sun Transit: ఈ నెల 13 నుండి మే 14 వరకు రవి మేష రాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఇది కొన్ని రాశులకు శుభప్రదంగా, మరికొన్నింటికి ప్రతికూలంగా ఉంటుంది. వృషభం, కన్య, తుల సహా మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రం వంటివి పఠించడం మంచిది. ప్రతి రాశికి సంబంధించి సూచనలు, జాగ్రత్తలు ఇక్కడ వివరించడం జరిగింది.

Telugu Astrology
ఈ నెల 13 నుంచి మే నెల 14వ తేదీ వరకు రవి మేష రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం జరుగుతోంది. గ్రహ రాజైన రవి ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల కొన్నిరాశులకు రాజయోగాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని రాశులకు అవయోగాలు కలగజేసే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రం, సూర్య మంత్ర జపం వంటి వాటితో రవిని శాంతింపజేయడానికి, తద్వారా చెడు ఫలితాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వృషభం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులను ఉచ్ఛ రవి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి వ్యయ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి, విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి నత్తనడక నడుస్తుంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు, వివాదాలు తలెత్తుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలకు విరామం ప్రకటించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి.
- కన్య: ఈ రాశికి అష్టమ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మోసపోయే లేదా నష్టపోయే అవకాశం ఉంది. కొందరు సన్నిహితులైన బంధుమిత్రులు దూరమవుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అధికారులు దూర ప్రాంతానికి బదిలీ చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక ఆర్థిక సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఆదా యం బాగానే వృద్ధి చెందినా వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి.
- తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల ఉద్యోగ జీవితంలో ప్రాభవం పెరగవచ్చు కానీ, కుటుంబ వ్యవహారాలు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తుతాయి. వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఇతరుల పనుల మీద సమయం వృథా అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు మందగిస్తాయి.
- వృశ్చికం: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల ప్రభుత్వం నుంచి సమస్యలు తలెత్తడం, బంధుమిత్రులతో అకారణ వైరాలు ఏర్పడడం, తండ్రితో కలహించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగుల కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి వివాదాలు మరింత జటిలమవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. ఇంటా బయటా ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది.
- మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల మనశ్శాంతి బాగా తగ్గుతుంది. సమీప బంధువులు, సన్నిహిత మిత్రుల వల్ల నష్టపోవడం, సమస్యల్లో కూరుకుపోవడం జరుగుతుంది. ఊహించని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల్లితో మాట పట్టింపులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ప్రశాంత, సానుకూల పరిస్థితులు ఉండకపోవచ్చు. ఆస్తి సమస్యలు ప్రారంభం అవుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ఆదాయం కొద్దిగా తగ్గుతుంది.
- మీనం: ఈ రాశికి అత్యంత పాప గ్రహమైన రవి ధన స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులతో బ్యాంక్ బ్యాలెన్స్ బాగా తగ్గుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మాట తొందర వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ఆర్థికంగా మోసపోయే అవకాశం కూడా ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.