ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన గురు గ్రహం మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ గ్రహం మేష రాశిలో ఏడాది పాటు ఉంటుంది. మేష రాశిలో ఇప్పటికే రాహు గ్రహం సంచరిస్తోంది. రాహు గ్రహం అక్టోబర్ 24 వరకు మేష రాశిలో కొనసాగి ఆ తరువాత మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. అంటే ఏప్రిల్ 23 నుంచి అక్టోబర్ 24 వరకు గురు, రాహు గ్రహాలు మేష రాశిలో కలిసి ఉంటాయి. ఏ రాశిలో అయినా గురువు రాహువు లేదా గురువు కేతువు లేదా గురువు శని కలిస్తే దానిని గురు చండాల యోగంగా పరిగణించడం జరుగుతుంది.
ఈ గురుచండాల యోగం వల్ల కొన్ని రాశుల వారు అకస్మాత్తుగా ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది సక్రమ మార్గాలలో కంటే అక్రమ మార్గాలలో మాత్రమే ఎక్కువగా జరుగుతుంది. గురు చండాల యోగం వల్ల వ్యక్తులు సంప్రదాయ విరుద్ధంగా, అనైతికంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. గురు గ్రహంతో పాపగ్రహం అంటే శని, రాహు, కేతువులు కలిసి ఉంటే అది పాపకార్యాలకు అవకాశం కల్పిస్తుంది. ఒక ఆరు నెలల పాటు ఈ యోగం మేష, మిధున, సింహ, తుల, కుంభ రాశులకు పట్టబోతోంది. ఆర్థికంగా ఈ రాశుల వారి జీవితాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆ రాశులు ఎవేవో చూద్దాం..
1.మేష రాశి
ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన గురువు మేష రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశి వారి ఆలోచనా ధోరణిలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఏదో విధంగా డబ్బు సంపాదించాలన్న తపన ప్రారంభం అవుతుంది. సరికొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. సంపాదనకు సంబంధించి కొత్త పుంతలు తొక్కుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అవసరమైతే అనైతిక కార్యకలా పాలకు పాల్పడేందుకు కూడా వెనుకాడరు. ఒకేసారి రెండు మూడు ఉద్యోగాలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
2.మిథున రాశి
ఈ రాశి వారికి ఆదాయ స్థానంలో గురు రాహువుల కలయిక చోటు చేసుకుంటుంది. జీవితంలో ఏదో ఒక విధంగా పురోగతి చెందాలన్న తాపత్రయం తొలిచేస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా వీరు అవినీతికి, లంచగొండితనానికి పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంది. డబ్బు సంపాదించడమే జీవిత ధ్యేయంగా వీరి ఆలోచనలు ముందుకు సాగుతాయి. డబ్బు సంపాదించడానికి వీరికి 24 గంటలు సరిపోవు. వృత్తి వ్యాపారాల్లో వీరు అక్రమ లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే సూచనలు ఉన్నాయి.
3.సింహ రాశి
చాలాకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి ఉన్న ఈ రాశి వారికి భాగ్య స్థానంలో గురు రాహు గ్రహాల కలయిక చోటు చేసుకుంటోంది. ధన సంపాదనే వీరి లక్ష్యంగా మారుతుంది. ఆ దిశగానే వీరి ప్రయత్నాలన్నీ ప్రారంభం అవుతాయి. సక్రమ మార్గాల కంటే అక్రమ మార్గాల ద్వారానే వీరికి కలిసి వస్తుంది. సాధారణంగా వడ్డీ వ్యాపారాల ద్వారా వీరి సంపాదన ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వాములను పక్కదోవ పట్టించి సంపాదన లేదా లాభాలు పెంచుకునే సూచనలు కూడా ఉన్నాయి.
4.తులా రాశి
ఈ రాశి వారికి గురు చండాల యోగం సప్తమ రాశిలో పట్టడం జరుగుతుంది. దీనివల్ల అక్రమ వ్యాపారాలు లేదా వ్యాపారంలో అక్రమాల ద్వారా ఆదాయాన్ని విపరీతంగా పెంచుకునే అవకాశం ఉంది. సాధారణంగా స్మగ్లింగ్, హవాలా, చిట్ ఫండ్ వంటి చట్టవిరుద్ధ వ్యాపారాలలో దిగిపోయే సూచనలు ఉన్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న వ్యక్తులతో వీరికి పరిచయాలు, సాన్నిహిత్యం ఏర్పడే అవకాశం ఉంది. సక్రమ మార్గంలో వ్యాపారాలు చేస్తూనే అక్రమ మార్గాలకు కూడా పాల్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా అవినీతి మార్గాలను అనుసరించవచ్చు.
6.కుంభ రాశి
ఈ రాశి వారు అనుకోకుండా, ప్రయత్నం ఏమీ చేయకుండా ధన సంపాదనకు అక్రమ మార్గాలను అనుసరించే అవకాశం ఉంది. కొందరు మిత్రులు ఈ రాశి వారిని పక్కదోవ పట్టించే సూచనలు ఉన్నాయి. సాధారణంగా ప్రలోభాల కారణంగా తప్పుదోవ తొక్కవచ్చు. అయితే, అవినీతి కార్యకలాపాల ద్వారానే వీరు సంపన్నులు అయ్యే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. డీలర్ షిప్, మార్కెటింగ్, ఏజెన్సీ వంటి రంగాలలో అక్రమ పద్ధతుల ద్వారా ధన సంపాదన చేయటం జరుగుతుంది. లిక్కర్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల ద్వారా కూడా సంపాదన పెంచుకోవడం జరుగుతుంది.
పరిహారాలు ఏమిటి?
నిజానికి వ్యక్తిగత జాతక చక్రంలో కూడా ఇటువంటి అవయోగం ఉన్నప్పుడు మాత్రమే ఈ గురు చండా ల యోగం వర్తిస్తుంది. అందువల్ల ఈ రాశుల వారు ఈ యోగాన్ని యధాతధంగా లేదా సంపూర్ణంగా తమకు వర్తింప చేసుకోకూడదు. ఇది ఎక్కువగా వ్యక్తిగత జాతక చక్రాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే, గ్రహ సంచారం ప్రకారం కూడా కొంతవరకు ఇది వర్తించవచ్చు. ఈ యోగానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకటి రెండు పరిహారాలను చెప్పడం అవసరం. తరచూ శివార్చన చేయటం వల్ల ఈ యోగం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. శివ స్తోత్రం పారాయణం చేయడం, మధ్య మధ్య శివాలయానికి వెళ్ళటం ఈ అవయవానికి సరైన పరిహారం అని చెప్పవచ్చు.
(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఊహలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా పాటించాలని అనుకుంటే నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.