Kuldeep Yadav Wedding Reception : లక్నోలో కుల్దీప్ గ్రాండ్ రిసెప్షన్.. విందులో వెరైటీ వంటకాలు.. మెనూ చూస్తే మైండ్ బ్లాకే
Kuldeep Yadav Wedding Reception : టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహమాడారు. లక్నోలో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌లో యోగి ఆదిత్యనాథ్ , గౌతమ్ గంభీర్ సహా పలువురు వీవీఐపీలు వెజ్ విందును ఆస్వాదించారు.

Kuldeep Yadav Wedding Reception : టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తన చిరకాల స్నేహితురాలు వంశికా చద్దాతో కలిసి మార్చి 14న ఏడడుగులు వేశారు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత, అంటే మార్చి 17న లక్నోలోని అత్యంత విలాసవంతమైన సెంట్రమ్ హోటల్లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. క్రికెట్ లోకం నుంచి గౌతమ్ గంభీర్, యశస్వి జైస్వాల్, శిఖర్ ధావన్ వంటి స్టార్లు ఈ వేడుకలో తళుక్కున మెరిశారు.
ఈ గ్రాండ్ రిసెప్షన్ లో అందరినీ ఆకర్షించింది మాత్రం అక్కడి రాయల్ విందు (మెనూ). కుల్దీప్ యాదవ్ తన రిసెప్షన్ లో పూర్తి శాకాహార (Pure Veg) వంటకాలను మాత్రమే వడ్డించాలని నిర్ణయించుకున్నారు. నాన్-వెజ్ కు తావు లేకుండా, శాకాహార వంటకాలతోనే అతిథుల మనసు గెలుచుకున్నారు. స్టార్టర్స్ లో పనీర్ టిక్కా, అక్రోట్ హరా భరా కబాబ్, చిల్లీ మష్రూమ్, వెజ్ స్ప్రింగ్ రోల్స్, రకరకాల పిజ్జాలు అతిథులకు నోరూరించాయి. రోస్టెడ్ టమాటో సూప్ తో పాటు రకరకాల సలాడ్లు కూడా మెనూలో కొలువుదీరాయి.
మెయిన్ కోర్స్ విషయానికి వస్తే, ఉత్తర భారత దేశపు సంప్రదాయ రుచులు కుల్దీప్ రిసెప్షన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దమ్ ఆలూ సబ్జీ, దాల్ తడ్కా, దాల్ మురాదాబాదీ, అంజీర్ కోఫ్తా కర్రీ వంటి వంటకాలు అతిథులను ఫిదా చేశాయి. ముఖ్యంగా రాజస్థానీ స్పెషల్ దాల్ బాటి చుర్మా విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితో పాటు నాన్, రోటి, లచ్చా పరాఠా, గార్లిక్ నాన్, స్టీమ్ రైస్ వంటి వెరైటీలు అందుబాటులో ఉంచారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథుల కోసం ఆహారంలో ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ చేశారు.
విందు ముగిశాక స్వీట్ల దగ్గర కూడా కుల్దీప్ అదిరిపోయే స్పిన్ వేశారు. సంప్రదాయ స్వీట్లైన జిలేబీ, రసమలై, బాదం హల్వా, గులాబ్ జామూన్లతో పాటు మోడ్రన్ డెజర్ట్స్ అయిన చాక్లెట్ వాల్‌నట్ బ్రౌనీ, యాపిల్ పై, పేస్ట్రీలను వడ్డించారు. అయితే మెనూలో కుల్దీప్ ప్రత్యేకంగా కోరి మరీ మాల్పువాను చేర్పించినట్లు సమాచారం. ఇంతకుముందు మార్చి 14న జరిగిన వివాహ వేడుకలో యుజ్వేంద్ర చహల్, తిలక్ వర్మ వంటి క్రికెటర్లు ఊపు తెచ్చే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసి కుల్దీప్ పెళ్లిని మరింత సందడిగా మార్చారు. ప్రస్తుతం కుల్దీప్-వంశికాల వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
