AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఈ బస్సుల్లో ఛార్జీలు పెంపు.. ఏకంగా 50 శాతం..

టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఉగాది సెలవులకు చాలమంది తమ సొంతూళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఈ బస్సుల్లో ఛార్జీలు పెంపు.. ఏకంగా 50 శాతం..
Tsrtc
Venkatrao Lella
|

Updated on: Mar 18, 2026 | 8:13 AM

Share

ఉగాది, రంజాన్ సందర్భంగా ఇంటికెళ్లే ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ షాకిచ్చింది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. మార్చి 17 నుంచి మార్చి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పుతోంది. ఈ బస్సుల్లో అదనంగా 50 శాతం ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. డీజిల్ ఖర్చులు, బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చుల కారణంగా అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను పెంచుకునేందుకు 2023లో జీవో 16ను ప్రభుత్వం జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఇప్పుడు ఛార్జీలను సవరించినట్లు టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. తెలంగాణతో పాటు అంతరాష్ట్రాలకు తిప్పుతున్న స్పెషల్ బస్సులకు కూడా అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.

రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు

ఇక రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు అమలు చేస్తామని టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. కేవలం పండుగ కారణంగా తిప్పే ప్రత్యేక బస్సుల్లోనే ఎక్స్‌ట్రా ఛార్జీలు ఉంటాయని, ప్రయాణికులు దీనిని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఇక మహాలక్ష్మి పథకం యథాతధంగా వర్తిస్తుందని, మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందన్నారు. స్పెషల్ బస్సులు 17,18వ తేదీలతో పాటు 23వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

ఆర్టీసీ మరో శుభవార్త

మరోవైపు ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త అందించింది. త్వరలో ఏకంగా 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్, గ్రీన్ సెల్ మొబిలిటీ సంస్థలు త్వరలో ఈ బస్సును సరఫరా చేయనున్నాయని, అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఆగస్ట్ మధ్య కాలంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలకు ఈ కొత్త బస్సులను కేటాయించనున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. కనీసం నిల్చోవడానికి కూడా ఖాళీ ఉండటం లేదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొత్త బస్సుల రాకతో బస్సుల్లో కాస్త రద్దీ తగ్గే అవకాశముంటుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. డీజిల్ బస్సుల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో వాటి స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. దీని వల్ల పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Follow Us