శుక్ర, గురువుల అనుకూలత.. ఇక వారికి శ్రమ తక్కువ లాభం ఎక్కువ!
మార్చి 15 నుంచి శుక్రుడు, జూన్ 3 నుంచి గురువు అనుకూల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి జీవితం ఎంతో సాఫీగా సాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఆదాయం పెరగడం, ఉద్యోగం-పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు, సంతానం, విదేశీ అవకాశాలు, వృత్తి-వ్యాపారాల్లో అభివృద్ధి వంటి శుభఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి.

Happy Life Astrology
మార్చి 15 నుంచి జూన్ 16 వరకు శుక్రుడు, జూన్ 3 నుంచి ఏడాదంతా గురువు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల వారికి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంది. ఈ రెండు శుభ గ్రహాలు జీవితం సుఖప్రదంగా, యోగదాయకంగా సాగిపోయేలా చేస్తాయి. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులు చీకూచింతా లేకుండా, హ్యాపీగా, సాఫీగా జీవితం సాగించడానికి అవకాశం కలుగుతుంది. ఆదాయ వృద్ధి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు, సంతాన ప్రాప్తి, విదేశీ అవకాశాలు, వృత్తి, వ్యాపారాల్లో విజయాలు వంటివి తప్పకుండా సిద్ధిస్తాయి.
- వృషభం: ఈ రాశికి గురు, శుక్రులిద్దరూ అత్యంత శుభులుగా మారుతున్నందువల్ల ఈ ఏడాది చివరి వరకు జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి ఖాయం కావడం జరుగుతుంది. విలాస జీవితం గడుపుతారు. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
- మిథునం: గురు, శుక్రుల సంచారం కారణంగా ఈ రాశికి ధన, లాభ స్థానాలు బలోపేతం అవుతున్నందు వల్ల మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. సంతాన యోగం కలుగుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి గురు, శుక్రులు మార్చి 15 తర్వాత నుంచి బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల రాజయోగాలు, రాజపూజ్యాలు, ధన యోగాలు కలుగుతాయి వ్యక్తిగతంగానూ, కుటుంబంలోనూ సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.
- కన్య: శుక్ర, గురువులతో పాటు రాశ్యధిపతి బుధుడు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ప్రతి ఆదాయ ప్రయత్నమూ పూర్తి ఫలితాలనిస్తుంది. ఉన్నతస్థాయి వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. దాంపత్య జీవి తం కొత్త పుంతలు తొక్కుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- తుల: మార్చి 15 నుంచి రాశ్యధిపతి శుక్రుడు, జూన్ నుంచి ధన కారకుడు గురువు అనుకూలంగా సంచారం చేయడం వల్ల అతి తక్కువ శ్రమతో ఈ రాశివారు అతి ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. లాటరీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలగడంతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.
- మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు, ధన కారకుడైన గురువు ధన యోగాలను, రాజ యోగాలను కలిగించే అవకాశం ఉంది. ఫలితంగా ఉద్యోగ జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, రాబడి బాగా వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి.
Follow Us