Andhra Pradesh: వైసీపీని వీడనున్నారా ? వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే రాజకీయాలు చేస్తానన్న యార్లగడ్డ
వైసీపీ నేత, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గన్నవరం నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. ఇటీవల ఆయనపై వైసీపీ నుంచి పోటీ చేస్తారా.. లేదా టీడీపీ నుంచి పోటీ చేస్తారా అనే సందిగ్ధత నెలకొంది.

కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి.అధికార-ప్రతిపక్షాల మధ్యనే కాదు…అధికార పార్టీలో గ్రూపు తగాదాలు ఎప్పుడూ కాక పుట్టిస్తుంటాయి.గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు భవిష్యత్తు పై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.టీడీపీ నుంచి వల్లభనేని వంశీ అనధికారికంగా వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ వెంకట్రావు,మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కలిసి వంశీకి వ్యతిరేకంగా జట్టు కట్టారు.కొంతకాలం గా మౌనంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.
వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా?
వంశీ వైసీపీలో చేరిన తర్వాత కృష్ణా జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా యార్లగడ్డ పనిచేశారు.అయితే నియోజకవర్గానికి మాత్రం దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు కార్యకర్తలను కలవడం తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.అయితే వంశీకి గన్నవరం టిక్కెట్ దాదాపు కన్ఫర్మ్ కావడంతో తన పరిస్థితి ఏంటని దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.హనుమాన్ జంక్షన్ లో దుట్టా రామచంద్ర రావు తో భేటీ తర్వాత యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు గన్నవరంలో పెద్ద చర్చకు దాటితీసాయి.ఆయన వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకుంటారని జోరుగా చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే రాజకీయాలు చేస్తానన్న యార్లగడ్డ
దుట్టా తో భేటీ తర్వాత యార్లగడ్డ తీవ్ర అసంతృప్తి,అసహనంతో కామెంట్స్ చేశారు.తాను వైసీపీలోనే ఉన్నానని చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడలేదు.పైగా రాజకీయ పరిస్థితులు సరిగా లేకపోవడం తో కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయానని తీవ్ర అసహనముతో మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే రాజకీయాలు చేస్తానని స్పష్టం చేశారు.2024 లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంలో సందేహం లేదన్నారు.మరి ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనే దానికి కాలం నిర్ణయిస్తుందని చెప్పారు.వైసీపీ నుంచి పోటీలో వంశీ ఉన్నారు. ఇక మిగిలిందల్లా టీడీపీ…ఎలాగూ తెలుగుదేశం పార్టీ కూడా సరైన నాయకుడి కోసం వేట లో ఉంది.దీంతో యార్లగడ్డ కు టీడీపీలో రూట్ క్లియర్ అవుతుందని…అందుకే వైసీపీపై అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ టీడీపీకి వెళ్తే మరి దుట్టా పరిస్థితి ఏంటని చర్చ కూడా మొదలైంది.మొత్తానికి గన్నవరం రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు కనపడే ఛాన్స్ ఉంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..