- Telugu News Photo Gallery IMD issues heavy to very heavy rainfall alert for Telangana and Andhra Pradesh for next 3 days
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి మూడు రోజులపాటు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వేదర్ రిపోర్ట్..
Latest Weather Report: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఇది అల్పపీడనంగా మారి తీవ్ర ప్రభావం చూపనుందని.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Updated on: Jul 25, 2023 | 7:20 AM

Latest Weather Report: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఇది అల్పపీడనంగా మారి తీవ్ర ప్రభావం చూపనుందని.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాంతో.. ఆయా చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్పటికే హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, తెలంగాణకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. దీంతో.. ఇవాళ హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని నగరవాసులకు సూచించారు అధికారులు.

వాతావరణ శాఖ.. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇదిలాఉంటే, ఏపీలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం అల్పపీడనంగా ఏర్పడి.. రేపటికి.. వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో.. ఏపీలో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి.అటు.. రాయలసీమలోనూ పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.





























