Vizianagaram: అతడిని కాపాడుకోలేకపోయాం అంటూ గుండెలవిసేలా రోదిస్తున్న ఊరు..
Vizianagaram Murder Case: అతడు రాజకీయ నాయకుడు కాదు.. పెద్దపెద్ద పదవులు చేపట్టలేదు. మందీ లేదు మార్బలం లేదు. ఐనా అతడి వెనుక ఊరుఊరంతా నిలబడింది. ఐనా.. అతడిని కాపాడుకోలేకపోయాం అంటూ ఇప్పుడు గుండెలవిసేలా రోదిస్తోంది. ఎవరా ఊరికి మొనగాడు. సినిమాలో హీరోయిజాన్ని తలపిస్తున్న ఈ ఉదంతం ఎక్కడ జరిగింది?
విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామంలో ఏగిరెడ్డి కృష్ణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చేసేది గవర్నమెంట్ టీచర్ ఉద్యోగమే ఐనా.. ఊర్లో అందరికీ తల్లో నాలికలా ఉండేవాడు. ఎవరికి ఏం కావాలన్నా చేసిపెడుతూ ఊరికొక్కడుగా పేరు తెచ్చుకున్నాడు.. ఆయన మొన్న రాజాం సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. కృష్ణ హత్యతో ఊరుఊరంతా ఒక్కటైంది. చుట్టుప్రక్కల గ్రామస్థులు కూడా తరలివచ్చారు. రాజకీయ కక్షలతోనే టీచర్ కృష్ణను హతమార్చారని మండిపడుతూ… స్థానికంగా నివాసం ఉండే వెంకటనాయుడు, అతని బందువుల ఇళ్ల పై రాళ్ళు రువ్వారు. పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
హంతకులు వీళ్లే అంటూ నలుగురు నిందితుల్ని పట్టుకుని ముసుగులేసి మీడియా ముందు పరేడ్ చేయించారు పోలీసులు. గ్రామంలో ఆధిపత్యం కోసం కోట్లకొద్దీ అప్పు చేశారని, ఆ ఫ్రస్ట్రేషన్‌కి తోడు, తమకు క్రిష్ణ పొలిటికల్‌గా అడ్డుపడుతున్నారని, అందుకే చంపెయ్యాలని ప్లాన్ చేశారట. బొలెరో వాహనంతో ఢీకొట్టి, ముఖంపై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి, చంపేసినట్టు ప్రాధమిక విచారణలో తేలింది. టీచర్ కృష్ణ అంతిమయాత్రలో వేలాదిమంది గ్రామస్థులు పాల్గొని.. కన్నీటి వీడ్కోలు పలికారు.
టీచర్ కృష్ణ కుటుంబాన్ని స్థానిక టీడీపీ నాయకులు పరామర్శించారు. అల్లర్లు చేయొద్దని, ప్రత్యర్థుల ఇళ్ల పై దాడులు చేయొద్దని గ్రామస్తుల్ని కోరారు బొబ్బిలి రాజులు. ఊరు మొత్తాన్ని కదిలించిన టీచర్ కృష్ణ ఉదంతం ఇప్పుడు స్టేట్‌వైడ్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం