Andhra Pradesh: ‘కోడికత్తి కేసు’లో కొత్త ట్విస్ట్.. సీజేఐకి లేఖ రాసిన నిందితుడు.. ఏమని విన్నవించాడంటే..?
Andhra Pradesh: జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు నిందితుడు శ్రీనివాస్. ఈ సందర్బంగా తనకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదని.. జైలులోనే మగ్గిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
Andhra Pradesh: ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఆయనపై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడికత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో యావజ్జీవ కారగార శిక్ష అనుభవిస్తున్నాడు జనుపల్లి శ్రీనివాస్. ఇక ఈ ఘటనపై విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరగ్గా.. ఇందుకు నిందితుడు శ్రీనివాస్‌తోపాటు ఇరు పక్షాల లాయర్లు హాజరయ్యారు. అయితే విచారణ కొనసాగుతుండగానే ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిందితుడు శ్రీనివాస్ లేఖ రాసిన విషయం బయటపడింది. ఆ లేఖలో శ్రీనివాస్.. తనకు ఇంత వరకు బెయిల్ రాకపోవడంతో జైలులోనే మగ్గిపోతున్నానని.. ఇంకెంతకాలం ఇలానే ఉండాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా జైలు శిక్ష నుంచి తనకు విముక్తి కలిగించండంటూ వేడుకున్నాడు.
అలాగే తనపై నమోదైన ఈ కేసును డిస్ట్రిక్ట్ లా సర్వీస్ ఆథారటీ విచారించి న్యాయం చేయాలని కోరాడు. తనకు న్యాయం చేయాలని కోర్టుకు ఎన్నోసార్లు విన్నవించానని, కానీ ఎలాంటి స్పందనా రాలేదని.. ఇలాంటి పరిస్థితుల్లోనే లేఖ రాస్తున్నానని వెల్లడించాడు. గతంలో ఇదే విషయంపై సీజేఐకు శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ కూడా లెటర్ రాశారు. ఈ మేరకు అప్పటి లేఖ తెలుగులో ఉండడంతో సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకే దాన్ని ఇంగ్లీషులోకి ట్రాన్స్‌లేట్ చేసి మళ్లీ పంపిస్తున్నామని శ్రీనివాస్ తరఫు న్యాయవాది సలీం తెలిపారు. ఇంకా గతంలో నిందితుడి తల్లి సావిత్రమ్మ అప్పటి సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాశారని న్యాయవాది సలీం ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాగా, 2018 అక్టోబర్ 25న.. ఆనాటికి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌పై శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేశాడనే అభియోగాలతో అరెస్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. ఎన్నో సార్లు బెయిల్ కోసం విన్నవించుకున్నా.. ఫలితం లేకపోయింది. దీంతో శ్రీనివాస్ ఇకనైనా తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..