CM Jagan: ఇవాళ గుడివాడకు సీఎం జగన్.. పేదలకు టిడ్కో ఇళ్ల పంపిణీ.. పూర్తి వివరాలివే..
Gudivada News in Telugu: ఏపీలోనే అతిపెద్ద టిడ్కో క్లస్టర్‌ను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఒక పెద్ద గ్రామాన్ని తలపించేలా గుడివాడ శివారులో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించున్నారు. సీఎం పర్యటన కోసం గుడివాడలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు.
Gudivada News in Telugu: కృష్ణా జిల్లా గుడివాడ శివారులోని మల్లాయపాలెంలో అతిపెద్ద హౌసింగ్ క్లస్టర్‌ను నిర్మించింది ఏపీ ప్రభుత్వం. టిడ్కో ద్వారా నిర్మించిన ఈ ఇళ్లను ఇవాళ సీఎం జగన్ ప్రారంభించి లబ్దిదారులకు అందించనున్నారు. గుడివాడ మండలం మల్లాయపాలెంలో 77.46 ఎకరాలలో ఒకే చోట 8,912 టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్‌గా రూపుదిద్దింది ప్రభుత్వం. తొలి విడతలో 3, 296 ఇళ్లు నిర్మాణం కాగా రెండో విడతలో 5,616 ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. వీటిలో 300, 365, 430 చదరపు అడుగుల ఇళ్లు ఉన్నాయి.
అయితే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 720.28 కోట్లు ఖర్చయింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ వాటా 133.68 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 289.94 కోట్ల రూపాయలు అని.. లబ్దిదారుని ఋణంతో కలిపి మరో 296.66 కోట్ల రూపాయలు ఉన్నాయని సమాచారం. ఇంత పెద్ద క్లస్టర్ నిర్మాణంతో గుడివాడలో పండగ వాతావరణం కనబడుతోంది. టిడ్కో క్లస్టర్‌కు రాకపోకల కోసం అప్రోచ్ రోడ్లు, సీసీరోడ్డు, కల్వర్టులు, మంచినీటి సరఫరా పైపులైన్లు భూగర్భ డ్రైనేజి వ్యవస్థ, విద్యుత్తు సౌకర్యం వంటి సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పించింది.
మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణంతో పాటుగా లే అవుట్‌లో ఏర్పాట్లన్ని పూర్తి చేశారు వైసీపీ నాయకులు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.35 గంటలకు మల్లాయపాలెం లే అవుట్‌కు చేరుకుంటారు జగన్. హెలిపాడ్ నుంచి టిడ్కో ఇళ్ల సముదాయానికి చేరుకొని ఫ్లాట్లను పరిశీలిస్తారు. అనంతరం లేఅవుట్లో ఏర్పాటు చేసిన వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో పాల్గొంటారు. ఉదయం 11.05 గంటల నుంచి 11.50 గంటల వరకూ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్నం 12: 40 గంటలకు పర్యటన ముగించుకొని తాడేపల్లి నివాసానికి బయలుదేరుతారు. సీఎం పర్యటన కోసం జిల్లా కలెక్టర్ రాజబాబు, మాజీ మంత్రి కొడాలి నాని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం సభను సక్సెస్ చేసేందుకు జిల్లా వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..