Andhra: పైకి ఫోటో చూసి జేబులు కొట్టేవాడనుకునేరు.. అంతకుమించి.. ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరుగుద్ది
పైకి చూసి ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పక్కాగా జేబులు కొట్టేవాడు అనుకునేరు.. అంతకుమించి.. ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వాలని అతడు ఏం చేశాడో తెలిస్తే.. మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

జీవితంలో ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉండాలి. ఆ గోల్ సాధించేందుకు కష్ట పడాలి. ఈ విషయాన్ని గురువులు, పెద్దలు, ప్రవక్తలు చెబుతూనే ఉంటారు. కాని కొందరికి మంచి కంటే చెడు త్వరగా మనస్సులో కి ఇంజెక్ట్ అవుతుంది. జీవితాన్ని తేలికగా తీసుకోవటం, ఎలాగోలా బ్రతికేయవచ్చనే ధోరణి, క్రమశిక్షణ లేని నడవడిక వారిని కష్టాలు పాలు చేయటంతో పాటు ఏ తీరం చేరలేని పడవలా బ్రతుకు సాగిపోతూనే ఉంటుంది. కష్టపడి పైకి రావచ్చు, కష్టాన్ని అలవాటు చేసుకుంటే అందులో ఎదురయ్యే బాధను అనుభవంగా మార్చుకుంటూ మార్పు దిశగా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కాని ఈ కాలం యువకులు ఈజీ ఎర్నింగ్, గోయింగ్ లకు అలవాటు పడుతున్నా తీరు ఆందోళన కలిగిస్తోంది. కేవలం స్నేహితుడికి పార్టీ ఇవ్వటానికి చోరికి ఎవరైనా పాల్పడతారా..? పార్టీ వల్ల కలిగే ఆనందం ఎక్కువా.. ఫలితంగా జీవితంపై పడే మచ్చ ఎక్కువా.. అని ఆలోచించే విచక్షణ సైతం అతడికి లేకపోవటం ఇపుడు జైలు పాలు చేసింది.
అసలు ఏం జరిగిందంటే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మెంటేవారితోటకు చెందిన వాసవి.. స్థానిక శ్రీలక్ష్మి నారాయణ ట్రేడర్స్ షాపులో బియ్యం వ్యాపారం చేస్తుంది. వ్యాపారం ముగించుకుని రాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో 20 సంవత్సరాల యువకుడు ఆమె వెనుక నుంచి వచ్చి మెడ పట్టుకుని మెడలోని బంగారు మంగళసూత్రం తాడును బలంగా లాగాడు. రెండు లక్షల విలువైన 28 గ్రాముల బంగారు మంగళసూత్రాల తాడు తెగిపోయింది. వెంటనే దొంగను పట్టుకుని భయంతో పెద్దగా కేకలు వేసింది బాధితురాలు. పారిపోయేందుకు ప్రయత్నించిన దొంగ తన వద్ద ఉన్న చాకుతో ఆ మహిళను బెదిరించాడు.
అటుగా వెళుతున్న కొందరు దొంగను పట్టుకున్నారు. బంగారు తాడును, దొంగను, చాకును పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ యువకుడు పాలకొల్లు నాగరాజు పేటకు చెందిన కొప్పర్త అలెగ్జాండర్‌గా గుర్తించారు. ఇంటర్మీడియట్ పాసై స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు డబ్బులు లేక చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడని భీమవరం వన్ టౌన్ ఎస్సై నాగరాజు తెలిపారు. చోరీకి పాల్పడ్డ అలెగ్జాండర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. చాలామంది యువకులు కూలి పనులకు వెళ్లి ఆ వచ్చిన డబ్బుతో ఫీజులు కట్టి చదువుకుంటారు. ఇలాంటి వాళ్ళను ఆదర్శం గా తీసుకోవాలి కానీ చోరీలు, దొంగతనాలకు అలవాటు పడితే జీవితం కష్టాల పాలవడం ఖాయం.




