AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ!

హైదరాబాద్‌కు చెందిన స్నేహా రాజు రెండుసార్లు కిడ్నీ మార్పిడి చేయించుకుని అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా అంటార్కిటికాలో రాత్రి బస చేసి, అంటార్కిటిక్ సర్కిల్‌ను దాటిన అవయవ మార్పిడి గ్రహీతగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె చిన్ననాటి అనారోగ్యాన్ని అధిగమించి, పట్టుదలతో ఈ కఠిన ప్రయాణాన్ని పూర్తి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ!
Sneha Raju
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jan 31, 2026 | 11:03 PM

Share

హైదరాబాద్‌కు చెందిన స్నేహా రాజు అరుదైన ఘనత సాధించారు. రెండు సార్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని.. ప్రపంచంలోనే తొలిసారిగా అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టారు. అంతేకాదు అక్కడ రాత్రి బస చేయడం, అంటార్కిటిక్ సర్కిల్‌ను దాటడం వంటి కఠిన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. డిసెంబర్‌ 17 నుంచి 28 వరకు జరిగిన ఈ యాత్రలో స్నేహా రాజు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీ లిమిటెడ్‌లో డిప్యూటీ హెడ్‌ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్)గా పనిచేస్తున్నారు. రెండు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల తర్వాత సంపూర్ణ అంటార్కిటికా యాత్ర పూర్తి చేసిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ ప్రయాణం అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి ప్రారంభమైంది.

అక్కడి నుంచి డ్రేక్ ప్యాసేజ్‌ను దాటి అంటార్కిటికాకు చేరుకున్నారు. మొదట బరియెంటోస్ దీవిలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పోర్టల్ పాయింట్ వద్ద అధికారికంగా అంటార్కిటికా ఖండంలోకి ప్రవేశించారు. అక్కడే ఒక రాత్రి బస చేశారు. అనంతరం అంటార్కిటిక్ సర్కిల్‌ను దాటి డిటెయిల్ దీవికి చేరుకున్నారు. స్నేహా జీవితం చిన్ననాటి నుంచే పోరాటమే. మూడేళ్ల వయసులోనే ఆమెకు కిడ్నీ సమస్య ఉందని గుర్తించారు. చిన్నప్పటి నుంచే ఆసుపత్రులు, చికిత్సల మధ్యే ఆమె జీవితం సాగింది. ఏడేళ్ల వయసులో తొలి కిడ్నీ మార్పిడి జరిగింది.

అయితే కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్న సమయంలో, 2013లో రెండోసారి కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. అనారోగ్యం తన కలలకు అడ్డుకాదని నిరూపించారు. అవయవ మార్పిడి జీవితం ముగింపు కాదని, కొత్త ఆరంభమేనని చూపించారు. పర్వతాలపై నడకతో మొదలైన ఆమె ప్రయాణం క్రమంగా పెద్ద విజయాలకు దారి తీసింది. కలా పత్తర్, కశ్మీర్ గ్రేట్ లేక్స్ వంటి ట్రెక్కింగ్‌లు పూర్తి చేశారు. తీవ్ర చలిలో జరిగే చాదర్ ట్రెక్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసి, రెండు సార్లు కిడ్నీ మార్పిడి చేసిన వ్యక్తిగా ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఇప్పుడు అంటార్కిటికా యాత్రతో స్నేహా రాజు మరోసారి అందరికీ ప్రేరణగా నిలిచారు. ధైర్యం, పట్టుదల ఉంటే ఏ అడ్డంకినైనా దాటవచ్చని ఆమె కథ చెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి