AP Housing Scheme: ఏపీలోని ప్రభుత్వ ఇళ్ల లబ్దిదారులకు బిగ్ అలర్ట్.. ఆ లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయకపోతే డబ్బులు బంద్..!
ఏపీ ప్రభుత్వం ఇళ్ల లబ్దిదారులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. మార్చిలోగా పెండింగ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే బిల్లులు ఆగిపోతాయని హెచ్చరిస్తోంది. ఉగాది నాటికి ఇళ్లకు గృహప్రవేశాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఇంటి నిర్మాణాలపై లబ్దిదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్ల నిర్మాణ పథకం ద్వారా ఇల్లు మంజూరై నిర్మించుకుంటున్నవారికి డెడ్ లైన్ విధించింది. మార్చి నెలాఖరు నాటికి పెండింగ్‌లో ఉన్న ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజలకు సూచనలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఉగాదికి పెండింగ్‌లో ఉన్న ఇళ్లన్నీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఉగాదికి ఐదు లక్షల ఇళ్లకు ఒకేసారి గృహప్రవేశం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో మార్చిలోపు ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని లబ్దిదారులకు గృహనిర్మాణ అధికారులు సూచిస్తున్నారు.
ఉగాది తర్వాత చెల్లింపులు బంద్
ఉగాది నాటికి ఇంటి నిర్మాణం పూర్తి చేయకపోతే ఆన్‌లైన్ నుంచి పేరు తొలగించనున్నారు. దీని వల్ల చెల్లింపులు నిలిచిపోతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే వేగంగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని చెబుతున్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అదనపు సాయం కూడా అందిస్తోంది. దీంతో వీటి సాయంతో త్వరతగతిన ఇళ్లను పూర్తి చేయాలని ఏపీ గృహనిర్మాణశాఖ సూచిస్తోంది. ఇళ్ల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినవారిలో ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.75 వేలు అదనంగా ఆర్ధిక సహాయం అందిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది.
ఒకేసారి ఐదు లక్షల ఇళ్లకు గృహప్రవేశం
మార్చి చివరిల్లోగా పూర్తిచేయకపోతే లబ్దిదారుల పేర్లను ఆన్ లైన్ నుంచి తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతుందని తెలుస్తోంది. దీని వల్ల పెండింగ్ బిల్లులు ఆగిపోవడం వల్ల లబ్దిదారులు నష్టపోతారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మించి ఇచ్చింది. కానీ కొంతమంది సొంత స్థలంలో ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే ఈ నిర్మాణాలను కొంతమంది మధ్యలో ఆపివేశారు. అలాంటి లబ్దిదారులకు అదనంగా ఆర్ధిక సాయం ప్రభుత్వం అందుతోంది.
