నాంపల్లి ఘటన తర్వాత అలర్ట్ అయిన హైడ్రా.. వ్యాపారులకు చివరి ఛాన్స్!
నాంపల్లి అగ్నిప్రమాదం తర్వాత హైడ్రా అప్రమత్తమైంది. ఫర్నిచర్ షాపులపై దృష్టి సారించి, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల ను సీజ్ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో వ్యాపార సంఘాలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

నాంపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం హైడ్రాను అప్రమత్తం చేసింది. ఈ ఘటనను హెచ్చరికగా తీసుకున్న హైడ్రా నగరంలోని ఫర్నిచర్ షాపులపై దృష్టి పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, ఫైర్ సేఫ్టీ పాటించని పలు షాపులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్యక్షతన కీలక సమన్వయ సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాపార వర్గాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు రంగనాథ్.
ఫైర్ సేఫ్టీ విషయంలో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యానికి చోటు లేదని స్పష్టం చేశారు. ముందుగా నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆ గడువు పూర్తైన తర్వాత నగరవ్యాప్తంగా కఠిన తనిఖీలు చేపడతామని తెలిపారు. వ్యాపార సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం షాపుల సీజ్ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నామని, అయితే ఈ అవకాశాన్ని చివరి అవకాశం గానే భావించాలని హెచ్చరించారు. ఇటీవల మూసివేసిన తొమ్మిది షాపుల నుంచి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామనే అఫిడవిట్లు తీసుకుని మాత్రమే తిరిగి అనుమతిస్తామని తెలిపారు. భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
పాతబస్తీ, బేగంబజార్, ట్రూప్ బజార్, మదీన సెంటర్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కరపత్రాలు, సమావేశాలు, అగ్నిప్రమాదాల వీడియోల ద్వారా వ్యాపారులకు ప్రమాదాల తీవ్రతను వివరించాలని సూచించారు. సెల్లార్ల వినియోగంపై రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. సెల్లార్లను గోదాములుగా మార్చడం, స్టాక్ నిల్వ చేయడం, గ్రిల్స్ లేదా తాళాలు వేయడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. నాంపల్లి ఘటనలో సెల్లార్ కారణంగానే ప్రాణనష్టం జరిగిందని గుర్తు చేశారు. సెల్లార్లను కేవలం వాహనాల పార్కింగ్‌కు మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.
ప్రతి షాపులో ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాణ్యతలేని వైర్లు, అధిక లోడ్ ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. పవర్ ప్యానెల్స్ వద్ద అగ్ని వ్యాప్తి నివారణ చర్యలు తప్పనిసరిగా ఉండాలని, మండే వస్తువులను వైర్లు, లైట్లకు దగ్గరగా ఉంచరాదని సూచించారు. కింద షాపులు, పై నివాసాలు ఉన్న భవనాల్లో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. ఏసీలు, ఛార్జింగ్ పాయింట్ల వల్ల విద్యుత్ లోడ్ పెరుగుతుందని గుర్తుచేశారు. మదీన, బేగంబజార్ ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లకు ఆటంకం లేకుండా మార్గాలు ఖాళీగా ఉంచాలని, సెల్లార్లలో వాచ్మెన్ కుటుంబాలు లేదా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం నిషేధమని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
