AP News: నడిరోడ్డుపై పడగవిప్పిన 16 అడుగుల గిరినాగు.. అమ్మబాబోయ్.! చూస్తే గుండె గుభేల్
అది రాత్రి సమయం.. వ్యవసాయ కూలీలు తమ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. రోడ్డుపై వెళ్తుండగా.. అంతా చిమ్మచీకటి.. ఎటు వైపు సరిగ్గా కనిపించట్లేదు. ఈలోగా వింత శబ్దాలు వినపడ్డాయి. ఏంటా అని స్మార్ట్ ఫోన్ల లైట్లు వేసి చూడగా.. అమ్మబాబోయ్.!

రాత్రి తొమ్మిది గంటల సమయం. అంతా నిర్మానుష్యంగా ఉంది. చిమ్మ చీకటిలో వీధిధీపాలు వెలుగుతున్నాయి. విజయనగరం జిల్లా వేపాడ మండలం చామలాపల్లి నుంచి వెంకన్నపాలెం వైపు వెళ్లే రహదారిలో అరిగివాని చెరువు కల్లాల వద్ద గ్రామస్తులకు ఓ భయానక ఘటన ఎదురైంది. పనుల మీద బయటకు వెళ్లిన ఇద్దరు గ్రామస్తులు తిరిగి ఇంటికి వస్తున్నారు. అలా గ్రామంలోకి వస్తున్న వారికి కనిపించిన ఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీధి దీపాల వెలుగులో రోడ్డుపైనే ఓ పదహారు అడుగుల గిరినాగు పడగవిప్పి రెచ్చిపోయి బుసలు కొడుతోంది.
నలుపు, తెలుపు రంగుతో భయానకంగా ఉన్న ఆ పామును చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ముందుకు వెళ్లలేక అక్కడే నిలబడి పోయారు. పగలంతా పనులు చేసుకుని త్వరగా ఇంటికి వెళ్దామనుకున్న గ్రామస్తులకు గిరినాగు వారికి బ్రేక్ ఇచ్చింది. అయితే వారికి గిరినాగును కొట్టే ధైర్యం లేదు. దీంతో చేసేది లేక కొంతసేపటి తర్వాత గిరినాగు వెళ్లిపోతుంది. మనం కూడా ఇంటికి వెళ్లొచ్చని అక్కడే వెయిట్ చేశారు. అయితే ఎంత సేపు ఉన్నా గిరినాగు మాత్రం రోడ్డు పై నుండి కదల్లేదు. ఇక చేసేది లేక కొంత ధైర్యం తెచ్చుకొని గిరినాగును అక్కడి నుండి పంపేందుకు కేకలు వేస్తూ అందుబాటులో ఉన్న వస్తువులను గిరినాగుపై విసురుతూ.. గిరినాగును పక్కనే ఉన్న పొదల్లోకి పంపే ప్రయత్నం చేశారు.
కానీ గ్రామస్తుల వ్యవహారంతో గిరినాగు మరింత రెచ్చిపోయి బుసలు కొట్టడం ప్రారంభించింది. అప్పటికే సమయం రాత్రి 10:30 అయ్యింది. ఏం చేయాలో పాలుపోక మరికొందరు గ్రామస్తులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి పిలిచారు. అలా మరికొందరు అక్కడకు వచ్చారు. అయితే అలా వచ్చిన వారు కూడా గిరినాగును బంధించే సాహసం చేయలేకపోయారు. ఇక చేసేదిలేక ప్రక్క గ్రామంలో ఉన్న స్నేక్ క్యాచర్ కృష్ణ కు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కృష్ణ గిరినాగు ఉన్న ప్రాంతానికి వచ్చి కొంతసేపు గిరినాగును మచ్చిక చేసుకొని తరువాత గోనె సంచిలో బంధించి సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.




