Vijayasai Reddy: విశాఖకు రైల్వేజోన్ రాకపోతే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎంపీ విజయసాయి సంచలన ప్రకటన
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైల్వే జోన్ రాదంటూ కొన్ని పత్రికలు అసత్య కథనాలకు ప్రచారం చేస్తున్నాయని ఆయన..
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైల్వే జోన్ రాదంటూ కొన్ని పత్రికలు అసత్య కథనాలకు ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విభజన సమస్యలపై మంగళవారం జరిగిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం ప్రస్తావనకే రాలేదని వెల్లడించారు. కానీ కొన్ని పత్రికలు కలలుగంటూ, ఏవేవో ఊహించుకుంటున్నారని.. వాటిని ప్రజల మీదకు రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని తేలితే తప్పుడు కథనాలు రాసిన వారు బహిరంగంగా క్షమాపణలు చెబుతారా అని సవాల్ విసిరారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావట్లేదని, ఇది కలగా మిగిలిపోతుందని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రిని వైసీపీ పార్లమెంట్ సభ్యుల బృందం కలిసినప్పుడు రైల్వే జోన్ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారని వెల్లడించారు. అతి త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ప్రజల నుంచి వైసీపీని దూరం చేయాలని, వైసీపీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని చెడు ఉద్దేశ్యంతో దురుద్దేశపూర్వకంగానే రైల్వే జోన్ రాదంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ అనుకూల మీడియా చేస్తోన్న ఉద్దేశపూర్వక ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరన్నారు.
పునర్విభజన చట్టంలో రైల్వేజోన్ కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. రాజధాని ఎక్కడైతే ఉందో ఆ రాజధానిని కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలు కలిసే విధంగా రైల్వే లైన్ నిర్మించి, హైదరాబాద్ ను కనెక్ట్ చేయాలనే అంశంపై చర్చ జరిగింది. దానికి సంబంధించి రాష్ట్రం వాటా సొమ్ము ఇవ్వాలనేది కేంద్ర ప్రతిపాదన. పునర్విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి, కొవ్వూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేసి, హైదరాబాద్ కు కనెక్ట్ చేయాలని, ఆ మొత్తం నిధులను కేంద్రమే భరించాలనేది రాష్ట్రం తరఫున కోరామని పేర్కొన్నారు. ఈ అంశం చర్చకు వచ్చిందని.. అంతే కానీ విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి చర్చ రాలేదని స్పష్టం చేశారు.
విశాఖ రైల్వే జోన్ తప్పకుండా వస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రైల్వే జోన్ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందన్న ఆయన.. వైసీపీ చేస్తున్న పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రైల్వే జోన్ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి