Andhra Pradesh: వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం.. పొలిటికల్ హీట్ పెంచిన ఉత్తరాంధ్ర అభివృద్ధి..

Andhra Pradesh: ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో హీట్ పెంచుతుంది. రాష్ట్రంలోని అధికార,

Andhra Pradesh: వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం.. పొలిటికల్ హీట్ పెంచిన ఉత్తరాంధ్ర అభివృద్ధి..
Ysp Tdp
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2021 | 6:54 AM

Andhra Pradesh: ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో హీట్ పెంచుతుంది. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెర లేపుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్య సవాళ్ల పర్వానికి నాంది పలికింది. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసిందంటూ టీడీపీ ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదికను నిర్వహించింది. అయితే, ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదిక నిర్వహించే ముందు అసలు ఉత్తరాంధ్రకు టీడీపీ చేసింది ఏంటో చెప్పాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన ఉత్తరాంధ్ర అభివృద్ది, వైఎస్, జగన్మోహన్ రెడ్డిల ఏడున్నరేళ్ళ పాలనలో జరిగిన ఉత్తరాంధ్ర అభివృద్దిపై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్.

కాగా, జగన్మోహన్ రెడ్డి రెండున్నర ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు వైసీపీ చేసిందేమీ లేదంటూ ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించింది టీడీపీ. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కన్వీనర్ గా విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ముఖ్యనేతలతో కార్యక్రమం కొనసాగింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్రకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని.. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం 350 కోట్ల రూపాయిలు చంద్రబాబు కేటాయించి శంకుస్థాపన పనులు కూడా చేపడితే.. రివర్స్ టెండరింగ్ పేరుతో రెండున్నరేళ్లలో వైసీపీ ఒక్క పైస కూడా ఖర్చు చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చిందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ చిత్తశుద్ధితో పని చేయకుండా డ్రామాలు చేస్తోందంటూ మండిపడుతున్నారు. గంగవరం పోర్ట్ లో 10 శాతంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటాను అమ్మేయటాన్ని టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన IIPE, ట్రైబల్ యూనివర్సిటీ లకు ఇoతవరకు స్థల కేటాయింపులు జరపకపోవటానికి కారణం ఏంటని ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు రెండున్నరేళ్లలో ఉత్తరాంధ్రలో రహదారుల నిర్మాణం, మౌలిక వసతులు కల్పనపై చర్చించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ నిర్వహించిన ఉత్తరాంధ్ర రక్షణ చర్చ వేదికపై వైసీపీ మండిపడుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కోసం తప్ప అభివృద్ధి కోసం పాటు పడనీ టీడీపీ అసలు ఏ మొఖం పెట్టుకొని ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికను నిర్వహిస్తుందంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖకు ఐటీ పరిశ్రమల రాక, విమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల ఏర్పాటు, టూరిజం అభివృద్ది రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు వంటి కీలక నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని గుర్తు చేశారు. కొవిడ్ కష్ట కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఉత్తరాంధ్ర అభివృద్ధి, వైఎస్ఆర్, జగన్ మోహన్ రెడ్డి ల ఏడున్నరేళ్ళ పాలనలో జరిగిన ఉత్తరాంధ్ర అభివృద్ధి పై టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలంటూ అమర్నాథ్ సవాల్ విసిరారు. ఏ ఛానల్‌లో అయినా.. ఎవరి ఇంటి వద్ద అయినా చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.

150 కోట్ల రూపాయల కుంభకోణం చేస్తూ ప్రజల సొమ్మును కాజేసిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, మన్సాస్ భూముల అక్రమాలపై విచారణ ఎదుర్కొంటున్న అశోక్ గజపతిరాజు వంటివారు ఆ చర్చా వేదికలో కీలక వ్యక్తులుగా హాజరు కాబోతున్నారని ఎద్దేవా చేశారు. అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న సమయంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంకురార్పణ పడిందన్నారు. అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ఆమర్నాథ్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖను రాష్ట్ర విభజన సమయంలోనే రాజధానిగా ప్రకటించి ఉంటే విశాఖ ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. కానీ ఎందుకు అలా ప్రకటించలేదో చంద్రబాబు ఇప్పటికైనా సమాధానం చెప్పాలని అమర్‌నాథ్ రెడ్డి నిలదీశారు.

Also read:

AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..

KRMB Meeting: తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందా?

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఏ జిల్లాకు ఏ కలెక్టర్ అంటే..