Pawan Kalyan: జనసేన స్థూపాన్ని అడ్డుకున్న పోలీసులు.. వైసీపీ నేతల పనేనంటూ జనసైనికుల ఆందోళన
పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ జెండా స్థూపం ఉద్రిక్తతకు దారితీసింది. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో
Janasena Party: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ జెండా స్థూపం ఉద్రిక్తతకు దారితీసింది. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో జనసేన పార్టీ జెండా స్థూపం నిర్మాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా వారే కావాలని అడ్డుకుంటున్నారని జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఈ స్థూపం ప్రారంభం చేయాలనుకున్న జనసేన నేతలకు పోలీసుల చర్యతో ఆటంకం ఏర్పడింది. కాటకూటేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జనసేన స్తూపం నిర్మాణ పనుల్లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలను అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారంటూ పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం ఆర్‌అండ్‌బి, పంచాయతీ అధికారులు జనసేన పార్టీ జెండా స్థూప నిర్మాణాన్ని నిలిపివేశారు. దీంతో అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో జనసేన స్తూపాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలో దిగారని జనసేన కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. నియోజకవర్గంలో ఇతర పార్టీ జెండా స్థూపాలకి ఎలా అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నిడదవోలు, సమిశ్రగూడెం, చాగల్లు పోలీస్ స్టేషన్ల సిబ్బందిని గ్రామంలో మోహరించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పొలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జనసేన పార్టీ మళ్లీ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరకాన్ని తలపిస్తున్న రోడ్ల మరమ్మతుల కోసం జనసేన పోరాటానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రహదారుల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో ఉద్యమం చేయాలని నిర్ణయించింది జనసేన పార్టీ. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.