Tirumala: గజరాజులకు కోపం వచ్చింది.. భయంతో పరుగులు తీసిన భక్తులు.. తిరుమల మాఢవీధుల్లో ఏనుగుల ఘీంకారానికి కారణం ఏంటి ?
తిరుమల మాఢవీధుల్లో ఊరేగింపులో ఉన్న గజరాజులకు కోపం వచ్చింది. అది స్వామివారి ఆలయంలో.. దీంతో భక్తులు బెదిరిపోయారు. తలో దిక్కుకు పరుగులు తీశారు.
Tirumala Elephants: తిరుమల మాఢవీధుల్లో ఊరేగింపులో ఉన్న గజరాజులకు కోపం వచ్చింది. అది స్వామివారి ఆలయంలో.. దీంతో భక్తులు బెదిరిపోయారు. తలో దిక్కుకు పరుగులు తీశారు. నవనీత సేవ ఊరేగింపులో ఘీంకరిస్తూ పరుగులు తీశాయి. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏనుగుల కాళ్లకు గొలుసులు వేసి మరీ అదుపు చేశారు మావటీలు. తిరుమల ఆలయం దగ్గరున్న ఏనుగులు ఘీంకరిస్తూ భక్తులను పరుగులు పెట్టించడం అరుదనే చెప్పాలి. చాలా తక్కువ సార్లు మాత్రమే తిరుమలకొండపై ఉన్న ఏనుగులు ఇలా భక్తులను భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాలున్నాయి.
ఏనుగుల ఘీంకారాలతో సోమవారం తిరుమల కొండ దద్దరిలింది. నవనీత సేవ ప్రారంభం సందర్బంగా గోశాల నుంచి ఏనుగులు శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరిన సమయంలో గోశాల నుంచి బయటకు రాగానే.. నందకం వద్ద వున్న డివైడర్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా భక్తులు వచ్చారు. ఇది చూసిన గజరాజులు బెదిరి..ఘీంకరించాయి. ఈ శబ్ధాలతో భక్తులు హడలిపొయ్యి పరుగులు తీశారు. ఏనుగులను నెమ్మదించేందుకు మావటీలు ప్రయత్నం చేసినా.. అదుపులోకి రాకపోవడంతో భద్రతా సిబ్బంది సహాయంతో ఏనుగులకు మావటీలు గొలుసులు వేసి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఊరేగింపు ముగిసి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నప్పటికీ ఏనుగులు ఘీంకారాలు చెయ్యడంతో మావటీలు.. ఏనుగులను నెమ్మదిగా గోశాలకు తరలించారు.
తిరుమల గోశాలలో ఏనుగులున్నాయి. శ్రీవారి సేవల సమయంలో మర్యాద కోసం ఏనుగులను తీసుకొచ్చి నిలబెడతారు. పీఠాధిపతులు దర్శనానికి వచ్చినపుడు ఏనుగులతో స్వాగతం పలుకుతారు. శ్రీవారి ఊరేగింపుల్లో ఏనుగులు.. వాహనాల ముందు నడుస్తుంటాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. సాధారణంగా శ్రీవారి సేవల సమయంలో ఏనుగులను ఆలయం దగ్గరకు తీసుకువస్తారు. సేవ ముగియగానే తీసుకెళ్ళి గోశాలలో విడిచిపెడతారు. అయితే నిన్న గజరాజుల ఘీంకారంతో భక్తులు హడలిపోయారు.