AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ యాక్సిడెంట్ జరిగింది ఎస్ఐ వల్లనే.. యువతి మృతి కేసులో సంచలన విషయాలు..

ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పలుకూరు దగ్గర ఈనెల 27న రోడ్డు ప్రమాదం జరిగింది. అందరూ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌ అనుకున్నారు. కానీ గంటలు గడిచేకొద్ది నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Andhra Pradesh: ఆ యాక్సిడెంట్ జరిగింది ఎస్ఐ వల్లనే.. యువతి మృతి కేసులో సంచలన విషయాలు..
Ap Crime News
Shaik Madar Saheb
|

Updated on: Nov 30, 2022 | 9:55 PM

Share

Woman Death Mystery : అసలే ప్రధాన రహదారి.. అన్ని వాహనాలు రయ్ రయ్‌ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో AP 39 KK 444 నంబర్‌ ఉన్న కారు మాత్రం ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది, స్పీడ్‌ ధాటికి ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారే ఈ రేంజ్‌లో డ్యామేజ్‌ అయిందంటే.. లోపల ఉన్న వాళ్ల సంగతేంటి? అనుకున్నారంతా.. కానీ కారులో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు తీవ్రగాయాలతో చనిపోయారు.. మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ప్రమాదం నార్మల్‌గా జరిగిందా? ఇంకేదైనా కోణం ఉందా? అని ఆరా తీయగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పలుకూరు దగ్గర ఈనెల 27న రోడ్డు ప్రమాదం జరిగింది. అందరూ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌ అనుకున్నారు. కానీ గంటలు గడిచేకొద్ది నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతను కందుకూరుకు చెందిన మహేష్‌.. తన ఫ్రెండ్‌తో కలిసి కారులో బయలుదేరాడు. పలుకూరు దగ్గర కారు ఆపి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలో కందుకూరు రూరల్‌ ఎస్సై శివ నాంచారయ్య వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడంతో యువతి కంగారుపడి బోరున విలపించింది. లాభం లేదనుకున్న మహేష్‌, తన ఫ్రెండ్‌ ఇద్దరూ కారెక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు వెంటాడుతున్నారన్న భయంతో కారు స్పీడ్‌ పెంచాడు మహేష్‌. ఆ సమయంలో అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. యువతి ప్రాణాలు కోల్పోగా.. మహేష్‌ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.

ట్రీట్‌మెంట్‌ తర్వాత స్పృహలోకి వచ్చిన మహేశ్‌.. జరిగిన విషయం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కందుకూరు రూరల్‌ ఎస్సై శివ నాంచారయ్య ఓవరాక్షన్ కారణంగానే కారు వేగంగా నడిపానని.. అప్పుడే యాక్సిడెంట్‌ జరిగిందని ఆస్పత్రిలో బెడ్‌పై నుంచే స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు మహేశ్‌. కారు ప్రమాదంపై సింగరాయకొండ ఎస్సై ఫిరోజ్ ఫాతిమా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే, పోలీసులు ఓవరాక్షన్‌ చేసింది నెల్లూరు జిల్లా పరిధిలో.. కారు యాక్సిడెంట్‌కు గురైంది ప్రకాశం జిల్లా లిమిట్స్‌లోకి వస్తుండటంతో.. బాధిత బంధువులు ఇరు జిల్లాల ఎస్పీలకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. ప్రాణాలు పోయేలా ప్రవర్తించడం దారుణమన్నారు.

ఇవి కూడా చదవండి

యువకుడి పక్కన యువతి ఉంటే ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బాధిత కుటుంబసభ్యులు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఎస్‌ఐ శివ నాంచారయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహేష్‌ ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి అసలు నిజం బయటికొచ్చింది. ఒకవేళ జరగరానిది జరిగి ఉంటే..? నిజం సమాధి అయ్యేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహేశ్‌ బంధువులు.

మలుపులు తిరిగిన ప్రమాదం కేసు.. చివరకు ఖాకీ మెడకు చుట్టుకుంది. మరి పోలీస్ ఉన్నతాధికారులు ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటారు..? బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేస్తారో చూడాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..