AP Politics: ప్రచారవ్యూహాలు సరే.. కూటమిలో నిరసన జ్వాలలు చల్లారేదెప్పుడు?
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మేమంతా సిద్ధం అంటూ వైసీపీ సవాల్ విసురుతుంటే... అంతే ధీటుగా సంసిద్ధం అంటోంది కూటమి. ఇరువైపుల నుంచి మాటల తూటాలూ పేలుతున్నాయి. ఇక, అభ్యర్థుల ఎంపిక జరుగుతుండగానే.. కూటమిలో రాజుకున్న కుంపట్లు సెగలుపుట్టిస్తున్నాయి. ఈ అసంతృప్త జ్వాలలు ఇప్పట్లో చల్లారుతాయా? లేక అధికారపక్షానికి ఇదే బలంగా మారుతుందా? అనే చర్చ జరుగుతోందిప్పుడు. మరోవైపు, సీట్ల విషయంలో బీజేపీ తాత్సారం దేనికోసమనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుకట్టడంతో.. పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఒక్కటైన ఈ మూడు పార్టీలు.. ప్రచార వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్.. ఇక్కణ్నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారసరళిని సమీక్షించబోతున్నారు. మరోవైపు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ పార్టీ నేతలకు, క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
ఇదంతా బానే ఉన్నా… పొత్తులో భాగంగా సీట్ల పంపకం కూటమికి కొంత తలనొప్పిని తెచ్చిపెట్టింది. టీడీపీ, జనసేన పార్టీల్లో సీట్లు దక్కని ఆశావహులు బాహాటంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. మరి, వర్క్‌షాపులతో, ప్రత్యేక సమావేశాలతో ఈ అసంతృప్త జ్వాలలు చల్లారుతాయా? నేతలంతా ఒక్కతాటిపైకి వస్తారా? అన్నదే ఇప్పుడు కూటమిని వెంటాడుతున్న ప్రశ్న. తాజాగా, సీటు దక్కలేదని జలీల్‌ఖాన్ వర్గం.. చంద్రబాబును కాన్వాయ్‌ని అడ్డుకున్నంత పనిచేయడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.
మరోవైపు, జనసేన, బీజేపీ సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో.. టిక్కెట్ల కేటాయింపు ఎపిసోడ్ ఇంకెన్ని రోజులనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటివరకూ ఒక్క అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ హైకమాండ్… ఐదురోజులుగా రాష్ట్రపార్టీ నేతలతో ఢిల్లీలోనే సమాలోచనలు చేస్తోంది. ఆ క్లారిటీ కూడా వస్తే.. కూటమిలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతుందా? లేక అంతా సెట్టవుతుందా? అన్నదీ సస్పెన్స్‌గానే ఉంది. అయితే కూటమి నేతలు మాత్రం… వైసీపీని గద్దె దించేందుకు అంతా కలిసే పనిచేస్తున్నామని చెబుతున్నారు. ప్రజలు గెలవాలంటే ఏపీలో ఎన్డీఏ గెలిచి తీరాలంటున్నారు.
ఇక, కూటమికి, అధికార పక్షానికీ మధ్య మాటల మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. కూటమి పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారంటూ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆరోపణలు గుప్పిస్తే.. అదో జీరో కూటమి అంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
పొత్తులు కుదుర్చుకున్నప్పుడు ఇలాంటి అసంతృప్తులు సహజమేనంటున్న కూటమి నేతలు…బుజ్జగింపులపై దృష్టి సారించారు. మరోవైపు, విపక్షంలో లుకలుకలే తమకు కలిసొస్తాయని అధికార వైసీపీ భావిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరి వ్యూహాలు వారికి ఉండటంతో.. ఎన్నికలనాటికి ఏపీ రాజకీయం ఎటా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..
