Andhra Weather: ఏపీ వణికిపోయే న్యూస్.. కాచుకుకూర్చున్న మరో అల్పపీడనం..
ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నాలుగైదు రోజులలో రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దుబాయ్‌లో ఉన్న సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

విపత్తుల నిర్వహణ సంస్థ మరో బాంబ్ పేల్చింది. ఇప్పటికే వాయుగుండం కురిపిస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌కు ఇది పిడుగులాంటి వార్త అనే చెప్పాలి. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. దాని ప్రభావంతో వచ్చే నాలుగైదు రోజులలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. కాగా శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
కోస్తా తీరం వెంబడి 35-55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఈ వాతావరణ పరిస్థితులను గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: చేప అనుకుని చేతుల్తో పట్టి ఒడ్డున వేశారు.. తీరా చూస్తే.. ఓర్నాయనో..
వర్షాలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు.. మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని విభాగాలు కలిసి పని చేసి.. ప్రాణ, ధన నష్టాన్ని నివారించాలన్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో నష్టపోయిన.. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరుకు అనుమతులు జారీ చేశారు. గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసించే జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారని ఆదేశించారు.




