చంద్రబాబును కలిసేందుకు వెళ్దామనుకున్నా కానీ.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబును కలిసేందుకు రజనీకాంత్ రాజమండ్రి వస్తారన్న ప్రచారం గత రెండ్రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆదివారంనాడు తమ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఎప్పుడు వెళ్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

చంద్రబాబును కలిసేందుకు వెళ్దామనుకున్నా కానీ.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rajinikanth (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 17, 2023 | 12:01 PM

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయన తనయుడు నారా లోకేష్‌తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్‌లో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఫైటర్.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను తప్పనిసరిగా అధిగమిస్తారంటూ నారా లోకేష్‌కు ధైర్యం చెప్పారు. అక్రమ అరెస్టులు, కేసులు చంద్రబాబును ఏమీ చేయలేవని, ఆయన చేసిన మంచి పనులే ఆయన్ను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని రజనీకాంత్ లోకేష్‌తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనకు ఆప్త మిత్రుడని రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు, రజనీకాంత్ మధ్య దశాబ్ధాలుగా ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.

రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు రజనీకాంత్  ఒకట్రెండు రోజుల్లో చెన్నై నుంచి అక్కడకు వస్తారని ప్రచారం జరిగింది. ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఇది హాట్ టాపిక్‌గా మారింది. అటు తమిళ మీడియా వర్గాల్లోనూ రజనీకాంత్ చంద్రబాబును కలిసేందుకు సోమవారం రాజమండ్రికి వెళ్తున్నట్లు  జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆదివారంనాడు తమ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఎప్పుడు వెళ్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వెళ్లాలనుకున్నట్లు తెలిపిన రజనీకాంత్.. అయితే ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదని చెప్పారు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఆయన చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రికి రావడం లేదని క్లారిటీ వచ్చేసింది.

చంద్రబాబు, రజనీకాంత్ మధ్య దశాబ్ధాలుగా ప్రత్యేక అనుబంధం ఉంది. ఇటీవల ఎన్టీఆర్ శతజయంతోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాలనపై రజనీకాంత్ ప్రశంసల జల్లుకురిపించారు. అయితే రజనీకాంత్ కామెంట్స్‌పై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

చంద్రబాబుకు సంఘీభావంగా..

ఇదిలా ఉండగా.. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలంటూ ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నందమూరి రామకృష్ణ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలు, పక్క రాష్ట్రాల నుంచి సంఘీభావం అందుతోందన్నారు. చంద్రబాబు అరెస్టు వార్తతో షాక్‌కు గురై మరణించిన వారి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..