ACB Raids : విశాఖజిల్లా తహసీల్దార్ కార్యాలయాల్లో రెండోరోజూ కొనసాగుతోన్న ఏసీబీ తనిఖీలు
విశాఖజిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు ఇవాళ రెండో రోజూ కొనసాగుతున్నాయి. పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి..
ACB Raids – Visakha District : విశాఖజిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు ఇవాళ రెండో రోజూ కొనసాగుతున్నాయి. పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, అచ్యుతాపురం, విశాఖ అర్బన్, విశాఖ రూరల్ మండల కార్యాలయాలలో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. విశాఖపట్నం పాలనా రాజధాని ప్రకటన తర్వాత విశాఖ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎక్కువుగా భూ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో భూ లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మ్యుటేషన్స్, పాస్ పుస్తకాలు, కులధృవీకరణ పత్రాల జారీ లాంటి వాటిపై సోదాలు జరుగుతున్నాయి.
అటు, విశాఖ అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలోనూ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. దాదాపు జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, శృంగవరపు కోట, జామి, కొత్తవలస తహశీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జోరుగా సాగుతున్నాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో పలు దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా భూముల మార్కెట్ విలువ భారీగా ఉన్న మండలాలపై ఓ కన్నేశారు.
విశాఖ జిల్లాలో జాతీయ రహదారి విస్తరించి ఉన్న భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాలతో పాటు మహా విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్న కొత్తవలస, జామి, ఎస్.కోట తహసీల్దార్ కార్యాలయాలపై ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. నిన్న, ఇవాళే కాకుండా రేపు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Read also: Hyderabad Road accident : హైదరాబాద్ బాలానగర్‌లో విచిత్ర రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో యువకుడు మృతి