Kapu Nestham : ‘రేపు వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం.. రూ. 490.86 కోట్ల మేర మహిళలకు ఆర్ధిక సాయం’

రేపు(22.07.2021, గురువారం) వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతోంది...

Kapu Nestham : 'రేపు వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం..  రూ. 490.86 కోట్ల మేర మహిళలకు ఆర్ధిక సాయం'
Cm Jagan
Venkata Narayana

|

Jul 21, 2021 | 6:53 PM

YSR Kapu Nestam scheme : రేపు(22.07.2021, గురువారం) వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3,27,244 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ. 490.86 కోట్ల ఆర్ధిక సాయం అందించబోతున్నారు. అమరావతిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రేపు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్‌.

అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ సొమ్ముల్ని పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద మహిళల  ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని అమలుచేస్తున్నారు.

ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉంటే చాలు.. పథకం వర్తించేలా అమలుచేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయం అందించాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోంది.

వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 491.02 కోట్లు జమ చేయగా, రేపు 3,27,244 మంది పేద కాపు అక్కచెల్లెమ్మలకు అందిస్తున్న రూ. 490.86 కోట్లతో కలిసి మొత్తం రూ. 981.88 కోట్ల లబ్ది చేకూరుతోందని ప్రభుత్వం వెల్లడించింది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే.. కానీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండేళ్ళలోనే వివిధ పథకాల ద్వారా 68,95,408 మంది కాపు కులాల అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు 15 రెట్లు ఎక్కువగా రూ. 12,156.10 కోట్ల లబ్ది చేకూర్చిందని ప్రభుత్వం వెల్లడిస్తోంది.

గత టీడీపీ ప్రభుత్వం కాపులు బీసీలా, ఓసీలా అన్న అయోమయానికి గురిచేస్తూ , చట్టప్రకారం సబ్‌ కేటగిరైజేషన్‌ చేయకూడదని తెలిసినా సబ్‌ కేటగిరైజేషన్‌ చేయడం ద్వారా న్యాయ వివాదాలపాలు చేసి అల్పాదాయ వర్గాలకు ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్లు దక్కకుండా వదిలివేసిన పరిస్ధితిని తీసుకొచ్చిందని జగన్ సర్కారు అంటోంది. ఈ పరిస్థితిని చక్కదిద్ది హమీ ఇచ్చి నెరవేర్చకుండా వదిలివేసిన ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్లు సైతం చిత్తశుద్దితో తమ ప్రభుత్వం అమలు చేస్తోందని జగన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఫలితంగా ఏ రిజర్వేషన్‌ లేని పేద, అల్పాదాయ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు.. ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్ల వల్ల కాపు వర్గాలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లబ్ది చేకూరుస్తుందని పేర్కొంది.

Read also : Padi Koushik Reddy : టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డి.. ఆహ్వానించిన సందర్భంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu