Vizag: అది జైలా.. డెన్ హా… ఎప్పుడో ఏదో ఒక యవ్వారం.. వివాదం…
విశాఖ జైలులో సెక్యూరిటీ లూప్ హోల్స్ మరోసారి చర్చకు దారి తీశాయి. ఏకంగా జైలులో సెల్‌ఫోన్లు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ చోట భద్రంగా పాతిపెట్టిన ఫోన్లను వెలికి తీశారు.కానీ వాటిలో సిమ్ కార్డ్స్ లేవు. అంటే ఎంతో ప్లాన్డ్‌గా జైలు నుంచి ఫోన్స్ ఆపరేటర్ చేస్తున్నారా? సిబ్బంది,అధికారుల సహకారం లేకుండా అది సాధ్యమా?
విశాఖ సెంట్రల్ జైలు వివాదాలకు కేరాఫ్‌గా మారింది. జైలులోకి గంజాయి బట్వాడా కలకలం రేపితే.. జైలు అధికారుల వేధింపులకు నిరసనగా సిబ్బంది కుటుంబాలు రోడ్డెక్కడం సంచలనం రేపింది.ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా జైలులో సెల్‌ఫోన్ల డంప్ మిస్టరీగా మారింది. అత్తారిల్లు అనే మాటకు నిదర్శనంగా మారింది విశాఖ జైలు. కొంతమంది ఖైదీలకు రాచమర్యాదలతో పాటు గంజాయి సప్లయ్ చేస్తున్న వైనాలు ఇటీవల బయటపడ్డాయి. ఫోన్ల డంప్ తెరపైకి వచ్చిన క్రమంలో..కొందరు క్రిమినల్స్ జైలును అడ్డా చేసుకొని ఫోన్ల ద్వారా సెటిల్మంట్ దందాలు చేస్తున్నారనే అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇక సెల్ ఫోన్లు దొరికిన ప్రాంతం పెన్నా బ్యారక్‌కు అతి సమీపంలో ఉంది. అందులో వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న రౌడీ షీటర్ హేమంత్ కుమార్ ఉన్నాడు. ప్రస్తుతం ఓ హత్య కేసులో హేమంత్ కుమార్ శిక్ష అనుభవిస్తున్నాడు. మరో రౌడీషీటర్ రాజేష్ కూడా అదే బ్యారక్‌లో ఉన్నాడు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు సెల్‌పోన్ల కేసులో ఆ ఇద్దర్నీ అనుమానితులుగా చేర్చార ఆరిలోవ పోలీసులు.
మొబైల్స్ అయితే దొరికాయి.. కానీ అందులో సిమ్ కార్డ్స్ లేవు.. రహస్యంగా సెల్ఫోన్లను పకడ్బందీగా దాచి ఆ సిమ్ కార్డులను పడేసారా..? లేక మరోచోట ఎక్కడైనా దాచారా..? ఇంతకీ ఆ సిమ్ కార్డులు ఎక్కడ..? ఇంతకీ ఆ మొబైల్స్ జైలు లోపలకి ఎలా వెళ్లాయి..? ..ఈ ఫోన్ల ద్వారా ఎవరు? ఎవరెవరకి కాల్స్ చేశారు? విశాఖ సిపి శంకర్ బ్రత బాగ్చి ఆదేశాలతో ఇలా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు ఆరిలోవ పోలీసులు. సిఐ మల్లేశ్వర రావు తన సిబ్బందితో వెళ్లి విశాఖ సెంట్రల్ జైలులో విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా పెన్నా బ్యారక్‌లోని ఖైదీలను వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. పొంతనలేని సమాధాలను ఇచ్చినట్టు తెలుస్తోంది. జైలులో ఫోన్లు రౌడీషీటర్లు హేమంత్‌కుమార్, రాజేష్ కోసమేనని, సిబ్బంది సహకారంతోనే ఈ సెటప్ ఏర్పాటు చేశారనే అనుమానాలు అంతకంతకు బలపడుతున్నాయి. నిజాలేంటన్నది ఇక విచారణలో తేలాలి. జైలులో ఫోన్ల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.కేవలం సిబ్బంది సహకారంతోనే జైలులోకి ఫోన్లు వెళ్లాయా? లేదంటే కొందరు అధికారుల కోపరేషన్ కూడా వుందా? కేంద్ర కారాగారంలో భద్రతా లోపాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.